యాగంటి ఆలయం ఆంధ్రప్రదేశ్ లో ప్రసిద్ధిచెందిన క్షేత్రం. ఇక్కడ వున్న నంది విగ్రహం మిస్టరీ ఇప్పటివరకూ వీడనేలేదు. మొదట్లో చిన్నగా ఉన్న ఈ నంది విగ్రహం రానురాను పెరుగుతూవచ్చి ఆలయప్రాంగణాన్ని ఆక్రమించుకుంది. యుగాంతంలో ఆ నంది పైకిలేచి రంకె వేస్తుందని అందరి భక్తులూ నమ్ముతూవుంటారు. మరి వివారాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లాలో బ్రహ్మం గారు నివసించిన బనగానపల్లి గ్రామానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమే యాగంటి.
ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యంతో పరవశింపచేసే పుణ్యక్షేత్రాలలో యాగంటి ఒకటి. యాగంటి బసవన్న అంతకంతకు పెరిగి కలియుగాంతమున లేచి రంకె వేస్తాడని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ప్రస్తావించబడి ఉంది. అంతేకాకుండా ఆ నందీశ్వరుని విగ్రహం సైజు అనేది పెరుగుతూవుండటం ఇక్కడ మరో విశేషం. దీనిని అర్కియాలజీవారు కూడా అంగీకరించటం జరిగింది. ఆ బసవన్న ఎప్పటికప్పుడు ఆకారం పెంచుకుంటూ వస్తున్నాడు.
ఈ మిస్టరీని ఇప్పటి వరకు ఎవరు చేధించలేకపోయారు. ఇంకా యాగంటి ఎన్నో విచిత్రమైన విశేషాలు ఉన్నాయి. యాగంటిలో ప్రధాన దేవాలయంలో ఉమామహేశ్వర లింగం కొలువై ఉంది. శివపార్వతులు ఇద్దరూ ఒకే లింగంలో కనిపించడం విశేషం. ఇక్కడ సహజసిద్ధంగా ఏర్పడిన గుహలు, ఎవరైనా ఒక ప్లాన్ ప్రకారం చెక్కారా అనిపిస్తూ వుంటాయి. అలాగే యాగంటిలో ఒక్క కాకి కూడా కనిపించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కొన్ని శాపాల కారణంగా ఇక్కడ కాకులు కనిపించవని ప్రచారంలో ఉంది.