సూర్యుడి వర్ణన గురించి చెప్పిన శతకం మీకు తెలుసా !

-

సూర్యుడు.. సప్తశ్వారూడుడు. ఆయనకు సంబంధించిన రహస్యాలను శతకరూపంలో రచించారు మన పూర్వీకులు..అలాంటి రచనల్లో ప్రధానమైనది మయూరశతకం. దక్షిణ భారత దేశంలో. పల్లవ రాజుల కాలంలో, మయూర మహాకవి విరచిత సూర్య శతకంలో, ప్రభా వర్ణనం (1-43) అశ్వ వర్ణనం (44-49) అనూరు వర్ణనం (50-61) రథ వర్ణనం (62-72) మండల వర్ణనం (73-80)రవి వర్ణనం (81-100)అన్న విభాగాలున్నాయి.ఇందులోని వర్ణనలు, అత్యంత సుందరాలు. కల్పనాచమత్కృతి అమోఘం. అర్థవంతం గా ఉన్నాయి. ఆ చిత్రభానుని కిరణాలను వివిధ రీతుల వర్ణిస్తూ ‘ అవి కిరణాలు కావు. ఆ పద్మ బాంధవుని పవిత్ర పాదాలు. ఆ కిరణలు శుభములకు ఆవిష్కరణలు. ప్రకృతికి అలంకారాలు. చాలా శక్తిమంతాలు. భక్తి భరితాలు. వీటి స్వభావం చాలా చిత్రంగా వుంటుంది.

ఇవి అతి సుకుమారమైనవి. అతి కఠినమైనవీ కూడా! పద్మాల హృదయాలలో చేరి ఆనందం అందించి చక్కిలిగిలి పెడతాయి. పర్వత పాషాణ చిత్రాలలో ప్రవేశించి, చైతన్యాన్ని అందిస్తాయి.’ ఇలా మొదలై పోను పోనూ అభివ్యక్తిలో చిక్కదనం ఇనుమడిస్తూ ఇనుమడిస్తూ, సూర్యునికీ శ్రీమన్నారాయాణునికీ అభేదం సూచించేంత వరకూ వెళ్ళటం-నిజంగా అద్భుతం. సూర్యుడెలా వున్నాడు? ప్రకృతికి బంగారు భూషణం వలె, పద్మరాగ మణి వలె, ఆకాశమనే నీలి కలువపై పసుపు వన్నె పుప్పొడివలె, కాలపన్నగ శిరముపై – మహారత్నము వలె, విశ్వసుందరి కంఠాన మెరుస్తున్న శుభకర మంగళసూత్రము వలె కాంతులు ప్రతిఫలింపగా, మంగళకరముగా సూర్యమండలం కనిపిస్తున్నదనటం – మయూరకవి అపూర్వ కల్పనాచాతురికి పరాకాష్ట! ఇంతేనా? ‘ఆదిత్య దీప్తి అఖిల ప్రపంచానికి రక్షణ కవచం. రవిమండలం- మహాయోగీశ్వరులకు ముక్తి మార్గం చూపించే అఖండ దీప్తి. కడుపులో పెనుమంటలు పెట్టుకుని, లోకం కోసం ప్రాణికోటికి చాలినంత వరకే కాంతిని వారి వుపయోగం కోసం ప్రసారం చేసె ఆదిత్యుని యేమని కీర్తించగలం? మహాత్ముల రచనలు అద్భుతం.

సూర్య సార్వ భౌమత్వాన్ని ప్రతిపాదించిన మయూరుడు, ఫల శృతిలో, యీ తన శతకాన్ని భక్తి శ్రద్ధలతో పాఠం చేసిన వారు సర్వ పాపాలనుంచీ విముక్తులవటమే కాక, వారికి ఆరోగ్యం, సత్కవిత్వం, అతులనీయమైన బలం, విద్య, ఐశ్వర్యం, సంపదలూ- అన్నీ సూర్య ప్రసాదాలుగా లభిస్తాయని ఘంటాపథంగా మయూరు శతకం పేర్కొన్నది.

– కేశవ

 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version