నియమ నిష్టలతో చేసే పూరీ జగన్నాథుని ప్రసాదం.. అమృతం

-

పూరీలో వెలసిన జగన్నాథుని లీలలు అన్నీ ఇన్నీ కావు. జగన్నాథుని విగ్రహాల దగ్గర నుండి ప్రసాదం వరకు విశేషాలతో కూడుకున్నవే. ఆ జగన్నోహనుడికి నివేదించే ప్రసాదం తయారీకీ నియమాలున్నాయి. స్వామి వారికి 56 నుండి 64 రకాల పిండి వంటలను నివేదిస్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద పాకశాలగా పూరీ ఆలయ పాకశాలను చెబుతారు. వేళ ఏళ్ల నుంచి మహా ప్రసాదం రుచి ఎలాంటి తేడా ఉండకపోవడం ప్రత్యేకత. ఇక్కడ వంటను సాక్షాత్‌ మహాలక్ష్మీదేవి అదృశ్య రూపంలో పర్యవేక్షిస్తుంటుందట, అందుకే అన్న ప్రసాదాలు అంత రుచికరంగా ఉంటాయని అక్కడి వారి విశ్వాసం. గంగ, యమున బావుల్లోని నీటిని ప్రసాదాల తయారీకి వాడతారు. ప్రసాదాన్ని, అన్న ప్రసాదాన్ని తయారు చేస్తున్నప్పుడు ఎలాంటి వాసన రాదట, ఎప్పుడైతే ఆ జగన్నాథునికి ప్రసాదం నివేదించిన తరువా ఆ ప్రసాదం నుండి సువాసనలు వస్తాయట.

రోజూ సూర్యుణ్ణి, అగ్ని దేవుణ్ణి స్తుతిస్తూ హోమం చేశాక మాత్రమే ఈ పొయ్యిలను వెలిగించడం ఏళ్ల నాటి నుంచి ఉన్నది. ఒకసారి వండిన కుండలపై మరోసారి వండరు. ఎప్పటికప్పుడు కొత్త కుండలు ఉపయోగించాల్సిందే. ఆ కుండలు కూడా పూరీ సమీపంలోని కుంభారు గ్రామస్తులు చేసినవే అయ్యుండాలి. దాదాపుగా 500 మంది పాకశాస్త్ర నిపుణులు, 300 మంది సహాయకులతోపాటు 200 మంది సామాగ్రిని అందించటానికి నియమింపబడి ఉంటారు. వంటలు చేసే వారు కాకుండా పాకశాలలోకి ఎవరైన వస్తే వండినదంతా భూమిలో పాతి పెట్టి పాకశాల శుద్ధిచేసి మళ్లీ వండుతారు. రోజులో ఆరుసార్లు ప్రసాదాన్ని ఆ జగన్నాథునికి నివేదిస్తారు. పాకశాలలో వంటలు తయారయ్యాక సేవాయత్లు వీటిని నియమానుసారం గర్భగుడిలోకి తీసుకెళతారు. వాటిని తీసుకెళ్లే సమయంలో ఎవరూ ఎదురు పడకూడదు. దేవుడికి ఆహారాన్ని ఓ రకమైన నాట్యం ద్వారా అర్పణచేస్తారు.

స్వామి వారి ప్రసాదాల్లో ఒబాడా ముఖ్యమైనది.. లక్ష్మీ పురాణం ప్రకారం దేవతలు అందరూ కలసి ఆరగించేదట. ఈ ప్రసాదాన్నే మహాప్రసాదం అంటారు. అన్నం, ముద్ద పప్పు, పొంతులా (కూరగాయల ఇగురు), పక్కోడో (తీపి పులుసు), ఖారి (పాయసం) వంటివన్నీ ఉంటాయి. కక్కరా, అరిసె, పూరి, చక్కోరి, బాల్సా, రసాబోలి, రసమలై… వంటి తీపి పదార్ధాలు ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news