తిరుప్పావై గోదాదేవి ఎవరో తెలుసా?

-

ధనుర్మాసం ప్రారంభమైంది. ధనుర్మాసం వచ్చిందంటే గోదాదేవి పాశురాలు వినిపిస్తుంటాయి. పవిత్రమైన ఈ మాసంలో తెల్లవారు ఝామున విష్ణు ఆలయాల్లో చదివే పాశురాలు రాసింది గోదాదేవి. ఆమె ఎవరు వాటి గురించిన విశేషాలు తెలుసుకుందాం…

ఆళ్వారులు అనగా భగవదనుభవంలో మునిగి ఉన్నవారని అర్థం. ఆళ్వారులు పన్నెండు మంది, వీరినే ‘పన్నిద్ధాళ్వారుల’ని కూడా అంటారు. వీరిలో అన్ని కులాల వారు ఉన్నారు. ఏ కులము వారైనా.. వారి భక్తి మార్గానికి, పాండిత్యానికి ప్రజలు వశులైనారు. వీరిలో ఒక మహిళ కూడా ఉన్నారు. ఆమె పేరే ఆండాళ్‌ (గోదాదేవి). కీ.శ. 776 నలనామ సంవత్సర కర్కాటక (ఆషాఢ) మాసంలో పూర్వ ఫల్గుణీ నక్షత్రయుక్త శఖ సమయాన దొరికింది. ఆండాళ్‌ అయోనిజ. ఆమె విష్ణు చిత్తులకు తులసీవనంలో లభించింది. విష్ణు చిత్తులకు ‘పెరియాళ్వారు’, భట్టినాథులు అనే నామాంతరాలు ఉన్నాయి. వీరు శ్రీవిల్లి పుత్తూరు (శ్రీధన్విపురం)లో ఉన్న వటపత్రశాయికి, నిత్యం పుష్పమాలికలను సమర్పించేవారు. భగవానుడి సేవలో తరించేవారు. ఓ రోజు తులసివనంలో యజ్ఞవాటిక కోసం తవ్వుతుండగా.. ఒక బాలిక కనిపించింది.

వీరికి సంతానం లేకపోవడం వల్ల ఆ బాలికను అల్లారుముద్దుగా పెంచి ‘కోదై’ (పూలదండ) అనే పేరుతో పిలిచేవారు. ఆమె చిన్నప్పటి నుంచి భగవంతుని పట్ల అచంచలమైన భక్తివిశ్వాసాలు కలిగి ఉండేది.
విష్ణు చిత్తులు వటపత్రశాయికి సమర్పించే పుష్పమాలికలను తాను ధరించాలనే కోరిక ఆండాళ్‌ మనసులో కలిగింది. ఆ మాలికలను ఎవరికీ తెలియకుండా తన శిరస్సున అలంకరించుకుని, తన ప్రతి రూపాన్ని నూతినీటిలో చూసి ఆనందించేది. ఓ రోజు విష్ణుచిత్తులు పూలమాలికలను ఆలయానికి తీసుకెళ్తుండగా అందులో తల వెంట్రుకలను చూశారు. అనుమానం వచ్చి ఆండాళ్‌ను అడుగగా, ఆమె తన తప్పు ఒప్పుకుంది. పుష్పమాలికలను స్వామికి సమర్పించలేక ఎంతో బాధపడ్డారు. ఆ రాత్రే విష్ణుచిత్తుల వారికి స్వామి కలలో కనిపించి ‘రోజూ నీవు తెచ్చిన పుష్పమాలికలు నీ కుమార్తె ధరించినవే, వాటిని నేను అత్యంత ప్రీతితో స్వీకరిస్తున్నాను. ఆమె ధరించిన మాలికలనే తీసుకొని రావాలని’ ఆదేశించారు. ఆనాటి నుంచి ఆండాళ్‌దేవికి ‘శూడికోడత్తనాచ్చియార్‌’ (ఆముక్తమాల్యద), ‘గోదాదేవి’ అనే పేర్లు కలిగాయి.

శ్రీరంగనాథుని రూపరేఖా విలాసాలను తండ్రి ద్వారా విన్న ఆండాళ్‌.. ఆ స్వామినే తన ప్రాణనాథునిగా పొందాలని నిశ్చయించుకుంది. ద్వాపర యుగంలో.. గోపికలు శ్రీ కృష్ణునిపై భక్తితో, అతడినే భర్తగా పొందదలచి ‘కాత్యాయనీ వ్రతం’ చేసి తరించారు. గోదాదేవి కూడా అదే వ్రతాన్ని కృష్ణుడిని భర్తగా పొందదలచి, శ్రీవిల్లి పుత్తూరునే గోకులంగా, తోటి చెలికత్తెలను గోపికలుగా, తనూ ఒక గోపికగా, అక్కడి రంగనాథుడినే తన నాథుడిగా భావించి మార్గశీర్షమాసంలో.. ముప్ఫయ్‌ రోజులు.. నిత్యం ఒక పాశురం (పాట)ను స్వామికి నివేదించి వ్రతసమాప్తి చేసింది. చివరి రోజున ‘భోగి పండు’గ నాడు ఆండాళ్‌ శ్రీరంగనాథునితో వివాహం జరుగుతుంది. ఈ తిరుప్పావై గ్రంథం సర్వవేదాలకు మూలం అంటారు.

ఆండాళ్‌ భూదేవి అవతారమని అంటారు. ఆండాళ్‌ రచించిన ‘తిరుప్పావై’ వ్రతగ్రంథం తర్వాత రచించిన మరో గ్రంథం ‘నాచ్చియార్‌ తిరుమొళి’. ‘తిరుప్పావై’ వ్రతం అయ్యాక పాండ్యదేశం రాజైన వల్లభరాములకు శ్రీరంగనాథుడు దర్శనమిచ్చి, ఆండాళ్‌ను తన వద్దకు తీసుకొచ్చి వివాహం చేయమని ఆదేశించాడు. శ్రీరంగం వెళ్లి కల్యాణం జరిగే లోపు ఆండాళ్‌ అనుభవించిన ‘ఆర్తి’ వాక్‌రూపంలో బయటకు వచ్చి ‘నాచ్చియార్‌ తిరుమొళి’ గ్రంథంగా అవతరించింది.

– కేశవ

గోదాదేవి ఫొటో వాడగలరు

Read more RELATED
Recommended to you

Exit mobile version