వరాల ఇచ్చే లక్ష్మీ వరలక్ష్మీ వ్రతం ఎలా చేయాలో తెలుసుకుందామా..?

అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉందంటారు. మిగిలిన లక్ష్మీ పూజలకంటే వరలక్ష్మీ పూజ శ్రేష్ఠమని శాస్త్ర వచనం. శ్రీహరికి ఇష్టమైన, పైగా విష్ణువు జన్మనక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయంటారు. సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకలాభీష్టాలకోసం, నిత్య సుమంగళిగా తాము వర్ధిల్లాలని పుణ్యస్త్రీలు ఈ వ్రతం చేస్తారు. దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మీ వ్రతాన్ని వివిధ సంప్రదాయాల్లో ఆచరిస్తారు. ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీ లక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరిదీ ఒక్కటే! సకల శుభంకరమైన, సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగదానందకరమైనదని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం. మరి అంతటి విశిష్టత ఉన్న వరలక్ష్మీ వ్రతం ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వరలక్ష్మీ వ్రతం రోజు ఎప్పుడు వస్తుందంటే.. పున్నమికి ముందు వచ్చే శుక్రవారమే వరలక్ష్మీ వ్రతం చేసుకునే రోజు. ఆ రోజున ఉదయమే లేచి అభ్యంగన స్నానం ఆచరించాలి. అనంతరం ఇంటికి ఈశాన్య భాగంలో ఆవుపేడలో అలకాలి. తర్వాత అక్కడ ముగ్గులు పెట్టి… మండపాన్ని తయారు చేయాలి. ఆ మండపంలో కొత్తబియ్యం పోసి అందంగా అలంకరించి ఆ బియ్యం మీద కలశాన్ని ఉంచాలి. వీలైలే మామిడి, మర్రి, మేడి, జువ్వి, రావి ఆకుల్లో ఏదైనా ఒకటి అందులో వేయాలి. కలశంపై కొబ్బరి కాయ పెట్టి జాకెట్ ముక్కను దానికి చుట్టాలి.

ఆ కలశం ముందు లక్ష్మీదేవి విగ్రహం పెట్టి వరలక్ష్మీ దేవిని ఆవాహనం చేయాలి. వరలక్ష్మీని కీర్తించాలి. ధ్యాన ఆవాహన షోడశోపచారాలు, అష్టోత్తరశత నామాలతో వరలక్ష్మీకి అర్చన చేయాలి. అష్టోత్తర శతనామాల్లో 108 కథలు ఉంటాయి. బ్రహ్మవైవర్త, విష్ణు, స్కంద, పద్మ, ఖాండ పురాణాల్లో లక్ష్మీదేవి వైభోగం, పూజాప్రాశస్త్యం గురించి చెప్పారు. అనంతరం అమ్మవారికి నైవేద్యం సమర్పించి కంకణాలను తయారు చేసి అమ్మవారికి అర్చించాలి. దాన్ని కుడి చేతికి కట్టుకోవాలి. ఇంటి సభ్యులందరికీ కంకణాలను కట్టాలి. భక్తితో నమస్కారాలు చేసి ఇంటికి ముత్తయిదువులను పిలిచి వాళ్లకు వాయినాలు ఇచ్చి వారి నుంచి ఆశీర్వాదం తీసుకోవాలి. దీంతో వరలక్ష్మీ వ్రతం పూర్తవుతుంది.