శుభకార్యాలలో అరటి ఎందుకు వాడుతారు?

-

అరటి.. అరటి ఆకులు, అరటి మట్ట.. అరటికాయ, అరటి పండు ఇలా అరటిని పలు రకాలుగా ప్రతి శుభకార్యంలో ఉపయోగిస్తారు. ఎందుకు దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. దీనితో ఏం ప్రయోజనం కలుగుతుందో తెలుసుకుందాం… అరటి శుభ సూచకం అని అందుచేత అరటిని శుభకార్యాలలో తప్పకుండా వాడుతారు.

Why use bananas in ceremonies

ఇతిహాసాలలో అరటి చెట్టు కథ!

అరటి పుట్టుక వెనుక ఒక ఇతిహాస సంబంధమైన కథ కూడా ఉంది. ఒకప్పుడు దూర్వాస మహాముని సాయం సంధ్యవేళ కూడా ఆదమరచి నిద్రపోతున్నప్పుడు ఆయన భార్య (కదలీ) సంధ్యావందనం సమయం కావడంతో ఆయనను నిద్ర నుండి మేలుకొల్పుతుంది. దుర్వాసుడి నేత్రాల నుండి వచ్చిన కోపాగ్నికి ఆవిడ భస్మరాశిగా మారిపోతుంది. కొన్నిరోజుల తరువాత దుర్వాస మహర్షి మామగారు తన కూతురు గురించి అడగగా ఆవిడ తన కోపాగ్ని వల్ల భస్మరాశి అయిందని చెప్పి, తన మామ గారి ఆగ్రహానికి గురికాకుండా ఉండేందుకు, ఆమెను చెట్టుగా మార్చి, శుభప్రదమైన కార్యాలన్నింటిలో కదలీఫలం (సంస్కృత పదానికి తెలుగు అర్థం అరటి) రూపంలో వినియోగించబడుతుంది అని వరాన్ని ఇస్తాడు. అరటి ఆకులను రకరకాల పనులకు ఉపయోగిస్తారు, ముఖ్యంగా భోజనం చెయ్యడానికీ, పెళ్ళిళ్ళలో మండపాల అలంకరణకు వాడతారు. సత్యనారాయణ వ్రతం, వరలక్ష్మీ వ్రతంలాంటి పలు శుభకార్య సంబంధ పూజలు, అయ్యప్య పూజ, కళ్యాణోత్సవాలలో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు.

దోష నివారణకు అరటి !

శాస్త్రంలో పలు రకాల దోషాలకు అరటితో సంబంధమైన పరిహారాలు మనకు కన్పిస్తాయి. వాటిని తెలుసుకుందాం… కుజదోషం ఉన్నవారు అరటిచెట్టుకు చక్కెర కలిపిన నీరు పోసి, తడిసిన ఆ మట్టిని నొసట బొట్టుగా ధరిస్తే ఉపశమనం కలుగుతుందంటారు. అరటినారతో తయారు చేసిన వత్తులతో దీపారాధన చేయడం వల్ల కొన్ని సత్ఫలితాలు కలుగుతాయంటారు. సంతానం లేనివారు అరటిచెట్టును పూజిస్తే మంచిదని చెబుతారు. ఆంజనేయస్వామిని ఆరాధించేవారు అరటితోటలో లేదా అరటిచెట్టు కింద స్వామి వారి విగ్రహాన్ని/ప్రతిమను/ పటాన్ని ఉంచి పూజిస్తే ఆయన తొందరగా అనుగ్రహిస్తాడని ప్రతీతి. అరటికి అంటుదోషం, ఎంగిలి దోషం అంటవు. అందుకే అన్ని దేవతల పూజలలోనూ అరటిని నివేదించవచ్చు. అరటిని ఆనారోగ్యానికి ఔషధంగా వాడతారు.

దీనిలో అత్యధికంగా ఉండే పొటాషియం బీపీ, అధిక ఒత్తిడిని తగ్గిస్తుంది. శరీరంలోని విషపదార్థాలను తొలగిస్తుంది. మానసిక ఒత్తిడితో బాధపడేవారు అరటిపండ్లు తినడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని, నిద్రలేమితో బాధపడేవారు రాత్రిపూట పాలు, అరటిపండు తీసుకుంటే నిద్ర బాగా పడుతుందని, అరటిపండు శరీర కండరాల్ని ఆరోగ్యంగా ఉంచుతుందనీ వైద్యనిపుణులు చెబుతారు. జీర్ణసంబంధమైన సమస్యలకూ అరటిపండు మంచి ఔషధంలా పనిచేస్తుంది. జబ్బుపడినవాళ్లు దీన్ని తింటే తొందరగా కోలుకుంటారు. అదేవిధంగా అరటి పుష్పాన్ని కూడా కూరగా తింటారు. ఇది మంచి పోషకవిలువలు కలిగి ఉంటుంది.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news