తెలంగాణ ఎంసెట్ ధ్రువపత్రాల పరిశీలనకు హాజరైన విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చుకునే గడువు ఇవాళ్టితో ముగియనుంది. ధ్రువపత్రాల పరిశీలనకు మొత్తం 74,292 మంది హాజరయ్యారు. వారిలో శుక్రవారం వరకు 66,340 మంది ఐచ్ఛికాలు నమోదు చేసుకున్నారు.
రాష్ట్రంలోని పలు కళాశాలలు డిమాండ్ లేని బ్రాంచీల్లో సీట్లను తగ్గించుకొని వాటి స్థానంలో కంప్యూటర్ సైన్స్ కోర్సులకు సంబంధించిన సీట్లను పెంచుకుంటున్నాయి. ఆ ప్రకారం 9,240 కొత్త సీట్లు మంజూరు కావాలి. వాటి వల్ల ఆర్థిక భారం పడదని, ఆ సీట్లకు అనుమతి ఇవ్వాలంటూ కొన్ని రోజుల క్రితం రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. ప్రభుత్వం వాటికి ఇప్పటి వరకు అనుమతి జారీ చేయలేదు. ఎంసెట్ ఆప్షన్ల గడువు శనివారంతో ముగియనున్న దృష్ట్యా.. ఈ సీట్లకు అనుమతి ఎప్పుడు లభిస్తుందోనని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.