70 ఏళ్లలో చేయలేనిది 70 రోజుల్లో చేసి చూపించాం.. ఎర్రకోటపై మోదీ

-

ఈ ప్రసంగంలో కూడా కొంత భాగం ఆర్టికల్ 370 రద్దు, జమ్ముకశ్మీర్ విభజన, రైతులకు మద్దతు ధర, పింఛన్ల పథకాలు, నీటి విలువ, ట్రిపుల్ తలాక్ లాంటి అంశాలపై ప్రసంగించారు.

73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. నిజానికి.. ఎర్రకోటపై ప్రధాని మోదీ ఏం మాట్లాడుతారా అని దేశమంతా ఆసక్తిగా ఎదురు చూసింది. ఎందుకంటే.. జమ్ముకశ్మీర్ పై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. కశ్మీర్ ను విభజించి… ఆర్టికల్ 370 ని రద్దు చేసిన తర్వాత ఒకసారి ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగించారు. అందులో మొత్తం కశ్మీర్ అంశం గురించే మాట్లాడారు. దీంతో ఇవాళ ఆయన దేనిమీద ప్రసంగిస్తారో అని అంతా ఎదురు చూశారు.

అయితే… ప్రధాని మోదీ… ఈ ప్రసంగంలో కూడా కొంత భాగం ఆర్టికల్ 370 రద్దు, జమ్ముకశ్మీర్ విభజన, రైతులకు మద్దతు ధర, పింఛన్ల పథకాలు, నీటి విలువ, ట్రిపుల్ తలాక్ లాంటి అంశాలపై ప్రసంగించారు. 70 ఏళ్లలో గత ప్రభుత్వాలు తీసుకోలేని ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలను 70 రోజుల్లో తాము తీసుకున్నామని జమ్ముకశ్మీర్ ను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు.

స్వాతంత్ర్య సమరయోధుల కలలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు

ఆర్టికల్ 370 ని రద్దు చేసి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ లాంటి ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల కలలను ప్రభుత్వం సాకారం చేస్తోందని ప్రధాని మోదీ అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం, రక్షా బంధన్ సందర్భంగా అందరికీ రక్షాబంధన్, స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో మహానుభావులు ప్రాణ త్యాగం చేస్తే ఈరోజు మనమంతా స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్నామని మోదీ తెలిపారు.

వారంతా తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశం కోసం పోరాడారు. స్వతంత్ర భారతం కోసం ఉరి తాళ్లకు కూడా బలయ్యారు. ఈసందర్భంగా ఇవాళ వాళ్లందరినీ నేను గుర్తు చేసుకుంటున్నాను. వాళ్లు తమ జీవితాలను త్యాగం చేయడం వల్లనే ఇప్పుడు మనం స్వేచ్ఛగా ఉండటంతో పాటు దేశం కూడా పురోగతిలో ముందుందని ప్రధాని తెలిపారు.

రైతుకు ఎల్లప్పుడూ అండగా కేంద్ర ప్రభుత్వం

దేశంలోని ప్రతి రైతన్నకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తోందని మోదీ స్పష్టం చేశారు. రైతులకు మద్దతు ధర, పింఛన్ల పథకాలను కేంద్రం అందజేస్తున్నట్టు ప్రధాని వెల్లడించారు. రైతుల ఆదాయ రెట్టింపు కోసం పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం. వ్యవసాయ రంగంలో అంతర్జాతీయ ప్రమాణాలు అందుకునే దిశగా ముందుకు వెళ్తున్నామని మోదీ తెలిపారు.

నీటి సంరక్షణ కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ

జల సంరక్షణ కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశాం. ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టాలి. నీటి సంరక్షణ కోసం మనం ఎంతో చేయాల్సిన అవసరం ఉంది. వాన నీటిని సంరక్షించడానికి సరికొత్త పద్ధతులతో ముందుకొచ్చేవాళ్లకు ప్రోత్సాహకాలు అందిస్తాం.. అని మోదీ తెలిపారు.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భారత్ మొదటి ప్లేస్ లో ఉంది. అలాగే రానున్న ఐదేళ్లలో భారత అర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్లుగా సృష్టించడమే లక్ష్యం. దేశ రక్షణ కోసం త్రివిద దళాలు చూపిస్తున్న తెగువ సాధారణమైనది కాదు. అందుకే… త్రివిద దళాల సమన్వయం కోసం త్వరలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ను నియమిస్తామని ఎర్రకోట ప్రసంగంలో మోదీ హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news