తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఇవాళ వైభవంగా ప్రారంభం కానుంది. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన సచివాలయంలో ప్రారంభించనున్నారు. కొత్త సచివాలయంలో జరగనున్న తొలి అవతరణ దినోత్సవ వేడుకలు కావడంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకకు వచ్చే వారి కోసం అన్ని రకాల వసతులు కల్పించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్.. తొలుత గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయం ప్రాంగణంలో జాతీయ పతాకావిష్కరణ చేసి, దశాబ్ది ఉత్సవ సందేశం ఇస్తారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో జాతీయ పతాక వందనం, దశాబ్ది ఉత్సవ సందేశాలు, ఇతర కార్యక్రమాలు కొనసాగుతాయి.
మొత్తం 21 రోజుల పాటు జరిగే దశాబ్ది ఉత్సవాల్లో వివిధ రంగాల్లో రాష్ట్రం సాధించిన ప్రగతిని వివరిస్తారు. లబ్ధిదారులు, ప్రజలతో సభలు, ర్యాలీలు, ప్రదర్శనలు జరుపుతారు. పోటీలు, కవి సమ్మేళనాలు, పురస్కారాలు, సత్కారాలు నిర్వహిస్తారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరుపుతారు.