యుద్ధ విమానాల ద్వారా ఆక్సిజన్‌ ట్యాంకర్ల తరలింపు

-

దేశంలో కరోనా తీవ్రత నేపథ్యంలో ఆక్సిజన్ కొరత ఏర్పడిన విషయం తెల్సిందే. దీంతో ఆక్సిజన్‌ సరఫరా కోసం తెలంగాణ ప్రభుత్వం యుద్ధ విమానాలను అనుమతిస్తోంది. ఆక్సిజన్‌ ట్యాంకర్లతో కూడిన యుద్ధ విమానాలు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ఒడిశా రాజధాని భువనేశ్వర్‌కు బయల్దేరి వెళ్లాయి. ఈ ఆక్సిజన్‌ ట్యాంకర్లను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన సోమేష్ కుమార్ బేగంపేట విమానాశ్రయంలో పరిశీలించారు. మొత్తం 8 ఖాళీ ట్యాంకులను హైదరాబాద్‌ నుంచి విమానాల్లో తరలించారు. వీటి ద్వారా భువనేశ్వర్‌ నుంచి 14.5 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ రాష్ట్రానికి రానుంది. ఆక్సిజన్ సరఫరా ఆలస్యం కాకుండా ఉండాలనే ఉద్దేశంతో దేశంలోనే తొలిసారిగాతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రయత్నం చేసింది.

కాగా రోడ్డు మార్గం ద్వారా ఈ ఆక్సిజన్‌ ట్యాంకర్లు రాష్ట్రానికి చేరుకోవాలంటే మూడు రోజుల స‌మ‌యం పడుతుంది. దీంతో సత్వరమే ఆక్సిజన్‌ తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేసారు. దీని వల్ల సమయం ఆదా కావడంతో ఎంతో మంది విలువైన ప్రాణాల‌ను కాపాడేందుకు ఈ ప్ర‌య‌త్నం దోహ‌ద‌ప‌డుతుంద‌ని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఈటలను, సీఎస్ సోమేష్ కుమార్ లకు అభినందనలు తెలిపారు.

కాగా రాష్ట్రంలో సరిపడా ఆక్సిజన్ లేనందున రాష్ట్ర ప్రభుత్వ విజ్ఙప్తి మేరకు కేంద్రం తెలంగాణకు 360 మెట్రిక్‌టన్నుల ఆక్సిజన్‌ను కేటాయించింది. ఇందులో 70 టన్నుల వరకు తెలంగాణలో ఇప్పటికే అందుబాటులో ఉన్న చిన్నచిన్న ఆక్సిజన్‌ ప్లాంట్ల నుంచి ఉండగా.. మిగిలిన ఆక్సిజన్‌ను బళ్లారి, భిలాయ్‌, అంగుల్‌ (ఒడిశా), పెరంబుదూర్‌ నుంచి తీసుకోవాలని సూచించింది.

Read more RELATED
Recommended to you

Latest news