హోళీ అంటే అర్థం ఏమిటి… అస‌లు హోళీ ఎందుకు చేసుకుంటోరో తెలుసా..?

హోళీ అంటే సర్వం రంగుల మయం. చిన్నపెద్దా అందరిలో ఆనందం. ఉత్సాహంగా… ఉల్లాసంగా.. చిన్నపెద్దా, కులం, పేద, ధనిక ఇలా ఏ బేధం లేకుండా ఆనందోత్సవాలతో ఆడుకునే రోజు. అసలు ఈ రంగులకేళీ ఎప్పటి నుంచి జరుపుకొంటున్నారు ? ఏయే ప్రాంతాల్లో ఏవిధంగా నిర్వహిస్తారో తెలుసుకుందాం…

హోళీ వసంతోత్సవం. ఏడాదిలో ప్రకృతిలో వచ్చే మార్పులకనుగుణంగా మన పూర్వీకులు ఏర్పాటు చేసిన గొప్ప పండుగల్లో హోళీ ఒకటి. రంగుల పండుగగా కీర్తికెక్కినది. ప్రేమకు ప్రతీకగా పేర్కొంటారు. ఇది హిందువుల ప్రాచీన పండుగే కాకుండా దక్షిణ ఆసియా ప్రాంతాల్లో ఇతర మతస్తులు దీన్ని జరుపుకొంటారు. ఈ పండుగ ఫిబ్రవరి/మార్చి నెలల్లో వస్తుంటుంది. హిందూ సంప్రదాయం ప్రకారం పాల్గుణమాసంలో వచ్చే పౌర్ణిమను హోళీగా, కాముని పున్నమిగా నిర్వహిస్తారు.

శిశిరరుతువు పోతూ వసంతం రావడానికి మరో పదిహేను రోజులు మిగిలిన ఈ సందర్భంలో ఈ పండుగను నిర్వహిస్తారు. శిశరంలో ఆకులు రాలిపోయి.. లేలేత రంగుల్లో వివిధ వర్ణాల్లో చెట్లు ఒక విచిత్రమైన శోభను సంతరించుకునే సంధి సమయం ఇది. ప్రకృతిలో పండిపోయిన ఆకులు, కొత్తగా చిగురిస్తున్న ఆకులు.. బంగారు వర్ణం.. లేత ఆకుపచ్చ..ఇలా ఇన్నెన్నో వర్ణాల మిశ్రతంగా కన్పించే అరుదైనకాలంలో వచ్చే పండుగ హోళీ.

హోళీ ఎందుకు చేస్తారు?

ఈ పండుగను పూర్వం నుంచి దుష్టశక్తులపై విజయానికి సంకేతంగా నిర్వహిస్తున్నారు. ప్రాచీనగాథల ప్రకారం ప్రహ్లాదుడిని చంపడానికి హిరణ్యకశ్యపుడు తన చెల్లెలు అయిన హోళీకాకు పురమాయిస్తాడు. ఆమె ప్రహ్లాదుడిని తీసుకుని అగ్నిలోకి దూకుతుంది. కానీ ఆమె మాయాశక్తులు పనిచేయకపోగా స్థితికారకుడైన విష్ణువు ప్రహ్లాదుడిని రక్షిస్తాడు.

holi 2019 date importance and significance when is holi 2019
holi 2019 date importance and significance when is holi

హోళికా అగ్నికి భస్మమవుతుంది. దుష్టశక్తిని అగ్ని దహించి వేయడంతో ఆ తర్వాతి రోజును హోళీగా నిర్వహిస్తున్నారని ప్రతీతి. మరోగాథ ప్రకారం శ్రీకృష్ణుడు పెరిగిన మధుర, బృందావనంలో ఈ పండుగను 16 రోజులపాటు ఘనంగా జరుపుకొంటారు.

 

మరోగాథ ప్రకారం శివుడి తపస్సు భంగం చేసేందుకు మన్మథుడు (కాముడు) ప్రేరేపించడం, శివుడు ఆగ్రహించి తన మూడోకన్నుతో భస్మం చేసినరోజు అని, ఆ సందర్భంలో పార్వతీ మాత కోరిక మేరకు మన్మధుడిని శివుడు మళ్లీ బ్రతికిస్తాడు, కానీ భౌతికంగా కన్పించకుండా కేవలం రతిదేవికి మాత్రమే కన్పించేలా వరమిస్తాడు. కామం కంటే నిజమైన ప్రేమ, ఆధ్యాత్మికతను తెలియజేసే ప్రతీకగా ఈ పండుగను నిర్వహించుకుంటారు.

ఈ పండుగరోజున ఆటలు, నవ్వులేకాకుండా ప్రేమతో తప్పులను క్షమించి అంతాకలిసి పోవడమే కాకుండా క్షీణించిన సంబంధాలను పునరుద్ధరించుకునే పవిత్ర హృదయాలను ఆవిష్కరించే రోజు ఇది. మొదట్లో భారత్, నేపాల్ దేశాల్లో ఉండే ఈ పండుగ క్రమేపీ ప్రపంచమంతా వ్యాపించింది.

ముందురోజే ప్రారంభం

హోళీ పండుగను ముందురోజే కాముని దహనంతో ప్రారంభిస్తారు. కాముని బొమ్మను తయారుచేసి ప్రధాన కూడళ్ల వద్ద కట్టెలు పెట్టి కామదహనాన్ని నిర్వహిస్తారు. ఆ సమయంలో అందరూ కలిసి పాటలు పాడుతూ నృత్యాలను చేస్తారు. తెల్లవారి అందరూ కలిసి రంగులకేళీని నిర్వహించుకుంటారు. గులాబీ, పసుపు, ఎరుపు, పచ్చ ఇలా ఇంద్రధనస్సు రంగులన్నింటిని ఒకరిపైఒకరు చల్లుకంటూ అలయ్‌భలాయ్‌లు ఇచ్చుకుంటూ.. భంగ్ తాగుతూ..నృత్యాలను చేస్తూ మధ్యాహ్నం వరకు నిర్వహిస్తారు. ఈ సమయంలో చిన్నవారు, పెద్దవారు, మిత్రులు, బంధువులు, ఆడా, మగ, పేద, ధనిక, పిల్లాపాపా వంటి బేధాలు లేకుండా అందరూ సంతోషంగా ఉల్లాసంగా ఒకరిపై ఒకరు రంగులు పోసుకుంటారు. గత ఇరవై ఏండ్ల కింద వరకు సహజసిద్ధమైన రంగులు, బుక్కా, గులాలు, మోదుగ పూలతో చేసిన రంగులు వాడేవారు. అవి ఆరోగ్యానికి మంచి చేసేవి.

holi 2019 date importance and significance when is holi 2019
holi 2019 date importance and significance when is holi

ఇవేకాకుండా రకరకాల వాటర్‌గన్/ట్యూబ్‌లు, బెలూన్లు, కలర్ షవర్స్‌తో రంగులను చల్లుకుంటూ, దాండియా, కోలాటం వంటి నృత్యాలను చేస్తూ సందర్భోచిత పాటలను పాడుతూ ఆనందంగా గడుపుతారు. తర్వాత దగ్గర్లోని నదులు, చెరువులు లేదా బావుల వద్ద స్నానం చేస్తారు. తర్వాత భోజనాలు ముగిసిన తర్వాత పిల్లలకు మెడలో హోలీ దండలను వేస్తారు. ఈ సందర్భంగా ఆడవారు ప్రత్యేక నృత్యాలను చేస్తారు. సోదరసోదరీలు హోళీ దండలతో (రంగురంగులతో ఉన్న బెల్లం/చెక్కరలతో చేసిన చిలుకల దండలు) ఆటాపాటా సాగిస్తారు. ఆయా ప్రాంతాల్లో హోళీ దండలు వేసినవారికి హోళీ మామూలు (ధనం/వస్తు రూపం)లో ఇచ్చి సంతోషపెడుతుంటారు.

హోళీ అంటే తియ్యని పదార్థాలకు (స్వీట్స్)కు ప్రత్యేకం. ఉత్తరాదిన ప్రత్యేకమైన పానీయాలు, స్వీట్లు తయారుచేసి అందరికీ పంచుతారు. సాయంత్రం అందరూ దగ్గర్లోని పార్క్‌లు, దేవాలయాలు, క్రీడామైదానాల్లో, ఒకరి ఇంటికి మరొకరు వెళ్లి శుభాకాంక్షలు చెప్పుకుంటారు. ఆనందంగా రాబోయే ప్రకృతిలోని మార్పులను ఆస్వాదించడానికి మానసికంగా, శారీరకంగా సిద్ధమవుతారు. ఇలా ప్రకృతితో మమైకమయ్యే అద్భుతమైన పండుగ.

– కేశవ