ఆయుర్వేదంలో తిప్పతీగకు ఎంతో ప్రాముఖ్యత ఉన్న సంగతి తెలిసిందే. దీన్ని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అయితే తిప్పతీగ (thippa theega)ను వాడడం వల్ల కొందరిలో లివర్ దెబ్బ తిన్నదని, లివర్ సమస్యలు వచ్చాయని కొందరు సైంటిస్టులు ఓ అధ్యయనాన్ని ప్రచురించారు. అయితే దీనిపై కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ స్పష్టతను ఇచ్చింది.
తిప్పతీగను ఆయుర్వేదంలో ఎప్పటి నుంచో వాడుతున్నారని, అది విష పదార్థం కాదని, కొందరు సైంటిస్టులు అసలైన అధ్యయనం చేయకుండానే తిప్పతీగను విష పదార్థంగా చూపిస్తున్నారని.. ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. వారు చేసిన అధ్యయనంలో నిజంలేదని, అసలు వారు అధ్యయనం చేయలేదని వారు సమర్పించిన పత్రాలను చూస్తేనే స్పష్టమవుతుందని, అందువల్ల తిప్పతీగను తీసుకుంటే లివర్ దెబ్బ తింటుందని, లివర్ సమస్యలు వస్తాయని అనడంలో అర్థం లేదని, అది మొత్తం అబద్దమని ఆ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
Relating Giloy to Liver damage is completely Misleading: @moayush
Relating Giloy or TC to liver damage would be misleading and disastrous to the Traditional Medicine system of India
Read here: https://t.co/WMbt7fbH7T
— PIB India (@PIB_India) July 7, 2021
ఏదైనా విషయం గురించి అధ్యయనం లేదా పరిశోధన చేయాలంటే దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలని, ఔషధాలపై ప్రయోగాలు చేస్తే వాటిని ఎంత మందికి ఏ విధంగా ఇచ్చారు ? అనే అంశాలను పూర్తి వివరాలతో పరిశీలించాలని, కానీ ముంబైలో పరిశోధనలు చేసిన సదరు సైంటిస్టులు ఈ అంశాలను పాటించలేదని, కనుక వారు చెప్పింది నమ్మడం లేదని స్పష్టం చేసింది.
కాగా గతేడాది ఆరు మంది తిప్పతీగను వాడారని, వారి లివర్ దెబ్బ తిన్నదని కొందరు సైంటిస్టులు ఇటీవలో ఓ అధ్యయనాన్ని ప్రచురించగా దానిపైనే పై విధంగా ఆయుష్ మంత్రిత్వ శాఖ స్పందించింది. వారు చెప్పిన ఆ విషయాన్ని ఎవరూ నమ్మకూడదని తెలిపింది.