కూతురు చనిపోయింది.. 45 మంది బాలికలకు చదివిస్తున్న మనసున్న ఓ తండ్రి

-

తిన్నామా.. పడుకున్నామా.. తెల్లారిందా.. అనే ఆలోచన లేకుండా చేతనైనంతలో తోటి వారికి సహాయం చేయాలి. అదే మానవత్వం అనిపించుకుంటుంది. అంతేకానీ.. నాకెందుకులే.. దేవుడు ఉన్నాడు కదా.. అతను చూసుకుంటాడులే అనే భావన పనికిరాదు. సమాజంలో ఉన్న తోటి మనుషులపై జాలి, దయ, కరుణ చూపాలి. వారికి చేతనైనంతలో సహాయం చేయాలి. సరిగ్గా ఈ మాటలను నమ్మాడు కనుకనే అతను ఆ 45 మంది బాలికలకు దేవుడయ్యాడు. అవును, మీరు విన్నది నిజమే. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే…

అది కర్ణాటకలోని కలబురగి సిటీ మక్తంపుర ప్రాంతం. అక్కడ నివాసం ఉండే బసవరాజ్‌ అనే వ్యక్తి స్థానికంగా ఉన్న మండల పరిషత్‌ హై స్కూల్‌లో క్లర్క్‌గా పనిచేస్తున్నాడు. అయితే గత కొంత కాలం కిందట అతని కూతురు అనారోగ్యం కారణంగా కన్నుమూసింది. అది బసవరాజ్‌ను ఎంతగానో కలచి వేసింది. అయితే కన్న కూతురు కన్ను మూసినా ఇతర బాలికల్లో అతను తన కూతుర్ని చూసుకున్నాడు. అందుకు అతను ఏం చేశాడంటే…

కన్న కూతురు పోయిన బాధ నుంచి బయట పడేందుకు బసవరాజ్‌ స్థానికంగా ఉన్న 45 మంది బాలికలకు ఈ ఏడాది నుంచి వారి విద్యకు అయ్యే ఖర్చును భరించేందుకు ముందుకు వచ్చాడు. అలా వారిలో తన కూతుర్ని చూసుకుంటున్నాడు. తమకు అంత సహాయం చేస్తున్న బసవరాజ్‌కు ఆ బాలికలతోపాటు వారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఏది ఏమైనా బసవరాజ్‌ చేస్తున్న పనికి మనం అతన్ని అభినందించాల్సిందే కదా..!

Read more RELATED
Recommended to you

Latest news