విజయదశమి ఏ పని ప్రారంభించినా ఇక అంతే!!

శరన్నవరాత్రుల్లో ముగిసిన తర్వాత పూర్ణాహుతి నిర్వహించే రోజు దశమి. ఈరోజు అమ్మవారి జన్మనక్షత్రం రోజు. అంతేకాదు.. స్థితికారకుడైన విష్ణువు నక్షత్రం కూడా శ్రవణమే. శ్రవణంతో కూడుకున్న దశమినే విజయదశమిగా జరుపుకొంటారు. శ్వయుజ శుక్ల దశమి నాటి నక్షత్రోదయ వేళనే విజయం అని చతుర్వర్గ చింతామణిలో ఉంది. ఆశ్వయుజ శుక్లపక్షంలోని మొదటి తొమ్మిది రోజులు జగన్మాతను ఆరాధిస్తారు. శరన్నవరాత్రుల పేరుతో అమ్మవారిని ఆరాధిస్తారు.

ఈ తొమ్మిది రోజుల్లో చివరి మూడురోజులు దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి. దేవదానవులు పాలసముద్రాన్ని మధించినప్పుడు విజయదశమి రోజునే అమృతం ఉద్భవించిందని ఇతిహాసాల్లో పేర్కొన్నారు. శ్రవణా నక్షత్రంతో కలసిన ఆశ్వయుజ దశమికి విజయా అనే సంకేతముంది. అందుకే దీనికివిజయదశమిఅనే పేరు వచ్చింది. తిథి, వారం, తారాబలం, గ్రహబలం, ముహూర్తం మొదలైనవి చూడకుండా విజయదశమి రోజు చేపట్టిన ఏ పనిలోనైనా విజయం తథ్యం. చతుర్వర్గ చింతామణిగ్రంథంలో ఆశ్వయుజ శుక్ల దశమి నాటి నక్షత్రోదయ వేళనే విజయం అని తెలిపింది. ఈ పవిత్ర సమయం సకల వాంచితార్ధ సాధకమైందని పండితులు పేర్కొంటున్నారు.

– కేశవ