వెజ్ హలీమ్.. పౌష్ఠికాహారానికి పెట్టింది పేరు.. తయారు చేయండిలా..!

-

Veg Haleem recipe preparation

హలీమ్.. అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా.. మంచి ఫుడ్. పౌష్ఠికాహారానికి హలీమ్ పెట్టింది పేరు. హలీమ్ అంటే హైదరాబాద్ గుర్తొస్తుంది. ఎందుకంటే.. హైదరాబాద్ లో దొరికినంతగా హలీమ్ మరెక్కడా దొరకదు. నిజాంల కాలం నాటి నుంచి హలీమ్ కు హైదరాబాద్ ప్రసిద్ధి. రంజాన్ సీజన్ లో హైదరాబాద్ లో రకరకాల హలీమ్స్ దొరుకుతాయి. వీటిలో వెజ్ హలీమ్, చికెన్ హలీమ్, మటన్ హలీమ్, బీఫ్ హలీమ్ చాలా ఫేమస్సు. చికెన్, మటన్, బీఫ్ హలీమ్ ఎలా చేయాలో మరోసారి నేర్చుకుందాం. ముందయితే వెజ్ హలీమ్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వెజ్ హలీమ్ చేయడానికి గోధుమ రవ్వ, ఓట్స్, కందిపప్పు, పెసరపప్పు, మినపపప్పు, నువ్వులు, మిరియాలు, యాలకులు, లవంగాలు, దాల్చినచెక్క, జీలకర్ర, సోయా గింజలు నానబెట్టినవి, డ్రైఫ్రూట్స్, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన కూరగాయల ముక్కలు, పాలు, చిన్నగా తరిమిన పచ్చి మిర్చి, కొత్తిమీర, పూదీనా, ఉప్పు, ఉడకబెట్టిన గుడ్డు, నిమ్మకాయల ముక్కలు గార్నిష్ కోసం ఉంటే చాలు..

తయారీ విధానం

గోధుమవర్వ, ఓట్స్, కందిపప్పు, పెసరపప్పు, మినపపప్పు, నువ్వులు, మిరియాలు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్ర అన్నింటినీ పొడిగా చేసి పెట్టుకోండి. ఓ గిన్నె తీసుకొని కొంచెం నూనె వేయండి. అది వేడెక్కాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించండి. దోరగా వేయించాక ఉల్లిపాయ ముక్కలను తీసి పక్కన పెట్టుకోండి. కుక్కర్ తీసుకొని అందులో ఇంత నెయ్యి కానీ నూనె కానీ వేసి అందులో జీడిపప్పు వేసి వేయించండి. దాంట్లోనే కొన్ని పచ్చి మిర్చి ముక్కలు, ఇదివరకే వేయించిన ఉల్లిపాయ ముక్కల్లో కొన్ని వేసి కాసేపు వేయించండి. ఇదివరకే కట్ చేసి పెట్టుకున్న కూరగాయల ముక్కలను కూడా దీంట్లో వేసి కాసేపు ఉడికించండి.

నానబెట్టిన సోయా గింజలను తీసుకొని ప్రెషర్ కుక్కర్ లో వేయండి. కొంచెం సేపు ఉడికిన తర్వాత అందులో పాలు పోయండి. అనంతరం కొన్ని నీళ్లు పోయండి. సన్నగా తరిమిన కొత్తిమీర, పూదీనా కూడా అందులో వేసి ముందుగానే రెడీ చేసిన పొడి వేయండి. తగినంత ఉప్పు వేసి అది ముద్దవకుండా కలపండి. కుక్కర్ మూత పెట్టి ఓ 15 నిమిషాల పాటు అలాగే ఉడికించండి. తర్వాత గ్యాస్ ఆపేసి… ఆ మిశ్రమాన్ని పప్పు గుత్తితో మెత్తగా చేయండి. అంతే.. వెజ్ హలీమ్ రెడీ అయినట్టే. దాన్ని సన్నగా తరిగిన కొత్తిమీర, పూదీనా, నిమ్మకాయ ముక్కలు, వేయించిన డ్రైఫ్రూట్స్ తో అలంకరించండి. కుదిరితే.. ఉడకబెట్టిన గుడ్డును డిజైన్ గా చేసి గార్నిష్ చేసి కుటుంబ సభ్యులకు సర్వ్ చేయొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news