పేపర్‌ కప్పులో టీ తాగితే ఏమవుతుందో తెలుసా..!

సరదాగా మాట్లాడుకుంటూ టీ లాగించేవారు ఎందరో కనిపిస్తుంటారు. అయితే రిలాక్స్ అవ్వడానికి తాగే ఆ టీ తో అనారోగ్యాలు వస్తాయని తెలిస్తే ఎవరైన తాగుతారా అంటే, అయినా తాగే వాళ్లు వున్నారు. ఇప్పుడిదంతా ఎదుంకు చెప్తున్నానుకుంటున్నారు కదూ.. ఎంతో మంది ఇష్టంతో తాగే తేనీరు వల్ల క్యాన్సర్​ వస్తుందంటున్నారు కొందరు శాస్త్రవేత్తలు. ఇటీవలె కాలంలో పేపర్​కప్పుల్లో టీ తాగడం విరివిగా చూస్తున్నాం. అయితే ఈ పేపర్​ కప్పుల్లో టీ తాగితే ఆరోగ్యానికి తొందరగా నష్టం చేకూర్చినవారు అవుతారంటూ అధ్యయనాలు చెప్తున్నాయి. అదేంటీ పేపర్​కప్పులో అంత హానికరమైనవి ఏముంటాయనుకుంటున్నారా అయితే ఈ కథనం చదవండి

tea-cups
tea-cups

ప్లాస్టిక్‌ కప్పుల్లో టీ తాగితే హానికరమని తెలిసిందే. అయితే వాటికి ప్రత్యామ్నాయంగా ఒకసారి వాడిపారేసే(డిస్పోజబుల్‌) పేపర్‌ కప్పుల్ని విరివిగా వినియోగిస్తున్నాం ఇప్పుడు. అయితే ఇప్పుడు వచ్చిన సమస్యల్లా కూడా అదే.. ఈ పేపర్‌ కప్పుల్లో టీ తాగినా హానికరమేనని ఖరగ్‌పుర్‌ ఐఐటీ అధ్యయనంలో తేలింది. ‘‘పేపర్‌ కప్పుల్లో వేడి ద్రవం పోసినప్పుడు ఆ పేపర్‌లోని మైక్రోప్లాస్టిక్‌ కణాలు, ఇతర ప్రమాదకర రేణువులు ద్రవంలో కలిసిపోతున్నాయని వారి అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

సాధారణంగా పేపర్‌ కప్పులు హైడ్రోఫోబిక్‌ ఫిల్మ్‌ సన్నటి పొరతో తయారు చేస్తారు. కాగా ఇందులోనూ పాలీ ఇథలీన్‌ అంటే ప్లాస్టిక్‌ ఉంటుంది. వేడి ద్రవం పోసిన 15 నిమిషాల్లోపే ఈ మైక్రోప్లాస్టిక్‌ లేయర్‌లో చర్య జరుగుతుంది’ అని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన అసోసియేట్‌ ప్రొఫెసర్‌ సుధా గోయెల్‌ చెప్పారు. 85-90 డిగ్రీల సెల్సియస్‌ వేడి ఉండే 100 ఎంఎల్‌ వేడి ద్రవంలోకి పేపర్‌ కప్పు నుంచి 25 వేల మైక్రోప్లాస్టిక్‌ రేణువులు విడుదలవుతాయని అధ్యయనపూర్వకంగా రుజువైందని వారు చెప్తున్నారు. ఈ రేణువుల్లో అయాన్లతో పాటు క్రోమియం, కాడ్మియం వంటి విషపూరిత భారీ లోహాలు ఉంటాయని ఆమె వివరించారు. వీటి వల్ల అనేక రకాలైన క్యాన్సర్లు వస్తాయంటూ చెప్తున్నారు.