ఆ నగరంలో ప్రతి ఐదుగురిలో ఒకరికి డయాబెటిస్.. ఆందోళన కలిగిస్తున్న అధ్యయనం..

-

మధుమేహం పెరిగిపోతుంది..మధుమేహం వల్ల తక్షణమే వచ్చే నష్టం ఏం ఉండదు కానీ..సరైన జాగ్రత్తలు పాటించలేదంటే అనేక సమస్యలు వస్తాయి.. కొన్నిసార్లు ప్రాణాంతకం కూడా కావొచ్చు. భారత్‌లో దీని ప్రభావం మరీ ఎక్కువ. జన్యుపరమైన కారణాలు, లైఫ్‌స్టైల్ మార్పులు, ఇతర కారణాలతో టైప్-2 డయాబెటిస్ కేసులు పెరుగుతున్నాయని గత అధ్యయనాలు తేల్చాయి. అయితే ఈ విషయంపై నిర్వహించిన కొత్త అధ్యయనంలో సంచనల విషయాలు వెలుగు చూశాయి. ముంబైలో నివసించే ప్రతి ఐదుగురు వ్యక్తుల్లో ఒకరు మధుమేహంతో బాధపడుతున్నట్లు ఈ స్టడీ తేల్చింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) పర్యవేక్షణలో ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (BMC) ఈ అధ్యయనం నిర్వహించింది. ఈ సర్వేలో ఎన్నో ఆశ్చర్యకర విషయాలు వెలుగు చూశాయి. ఇందులో భాగంగా ముంబైలోని ఆరువేల మందిలో ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవల్స్ తనిఖీ చేశారు. అలవాట్లు, బ్లడ్‌ ప్రెజర్‌, శరీర కొలతలు, ఎత్తు, బరువు, కొలెస్ట్రాల్‌ స్థాయిలు..లాంటి వాటినీ పరిగణలోకి తీసుకున్నారు. వీరిలో 18 శాతం మంది స్త్రీ, పురుషుల్లో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువగా ఉన్నట్లు తేలింది.

ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ 24 వార్డుల్లో 2021లో వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఈ అధ్యయనం నిర్వహించింది. వరల్డ్‌ డయాబెటిస్‌ డే కంటే ముందు, గత ఆదివారం నాడు ఈ సర్వే ఫలితాలు విడుదల చేసింది. ముంబైకర్లు 18 నుండి 69 ఏజ్‌ గ్రూప్‌లో 18 శాతం మందికి ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగి ఉన్నట్లు గుర్తించారు.

ముంబై నగరంలో ఈ కేసులు పెరగడంపై బీఎంసీ ఆందోళన వ్యక్తం చేసింది. అంతకు ముందు 2019-2020లో నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే (NFHS-5) 15 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న స్త్రీ, పురుషులపై అధ్యయనం నిర్వహించింది. వీరిలో 17 శాతం మంది స్త్రీలు 18శాతం మంది పురుషులలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువగా ఉన్నాయని అప్పట్లో తేలింది. ఏది ఏమైనా..జాగ్రత్త పడకపోతే..ప్రమాదంలో పడక తప్పదు..

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version