ఏ రంగు నాలుక ఏ సమస్యకు సంకేతం ..? ఈ కలర్ ఉంటే ఆక్సిజన్ లోపమట..!

సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు పెద్దలు.. ఆ కళ్ల తర్వాత అతి ముఖ్యమైనది నాలుక. కడుపులో వేసే స్టఫ్ మొత్తానికి ఇదే ఎంట్రీ పాయింట్ కదా. మీరు ఎప్పుడైనా గమనించారా..డాక్టర్ దగ్గరకు వెళ్లగానే ఆయన కళ్లతో పాటు నాలుక కూడా పరీక్షిస్తాడు. అసలు నాలుక ద్వారా ఏం తెలస్తుంది. నాలుక రంగును బట్టి మన ఆరోగ్య స్థితిని చెప్పవచ్చు. సాధారణంగా ఆరోగ్యకరమైన వ్యక్తి నాలుక సన్నని తెల్లటి పూతతో గులాబీ రంగులో ఉంటుంది.. అయితే మన నాలుక రంగు ఏ రంగులో ఉంటే ఏ అనారోగ్య సమస్యలకు సంకేతమో ఇప్పు చూద్దాం.

1. నాలుక నారింజ రంగులోకి మారినట్లు అయితే నోటి పరిశుభ్రత సరిగా లేకపోవటం లేదా నోరు పొడిబారడం వంటివి కారణాలు.

2. ఎక్కువగా పొగతాగేవారిలోనూ, కెఫిన్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకునేవారి నాలుక రంగు గోధుమ రంగులో ఉంటుంది.

3. బ్యాక్టీరియా పెరుగుదల వల్ల నాలుక పసుపు రంగులోకి మారుతుంది. నోటి అపరిశుభ్రత, పొడిబారిన నోరు ఇలా ప్రతి ఒక్కటి నాలుకపై బ్యాక్టీరియా పెరుగుదలకు కారణాలు అవుతాయి.. నాలుక పసుపు రంగులో ఉంటే అటువంటివారిలో జీర్ణ సంబంధ సమస్యలు, కాలేయ సమస్యల బారిన పడుతున్నారనే దానికి సంకేతమట.

4. కెరాటిన్ పేరుకుపోవడం వల్ల నాలుక నల్లగా మారుతుంది. కెరాటిన్ అనేది చర్మం, జుట్టు , గోళ్లలో ఉండే ప్రోటీన్. అంతేకాదు ఎక్కువగా యాంటీబయాటిక్స్ తీసుకునేవారి నాలుక నలుపు రంగులోకి మారుతుంది.

5. నాలుక ఎరుపు రంగంలోకి మారితే.. విటమిన్ బి లోపం, ఫోలిక్ యాసిడ్ లోపం ఉందని గమనించాలట. వైరల్ ఇన్ఫెక్షన్ల తో జ్వరం వచ్చినప్పుడు కూడా నాలుక ఎరుపు రంగులోకి మారుతుంది. జ్వరం వచ్చినప్పుడు మన ఇంట్లో ‌పెద్దవాళ్లు కూడా నాలుక చూసే చెప్పేస్తారు.

6. నాలుక ఊదా రంగులో ఉంటే మీకు రక్త ప్రసారంలో కానీ గుండె సంబంధ సమస్యలు కానీ ఉన్నట్లు గుర్తించాలి. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి ఎక్కువగా ఉన్నప్పుడు కూడా నాలుక ఊదా (Purple) రంగులోకి మారుతుంది.

7. రక్తంలో ఆక్సిజన్ తక్కువ స్థాయిలో ఉంటే నాలుక నీలం రంగులో మారుతుంది. గుండె రక్తాన్ని సరిగ్గా శరీరానికి ప్రసరణ చేయలేని సమయంలో రక్తంలో ఆక్సిజన్ తగ్గడం మొదలైనప్పుడు నాలుక రంగు నీలం రంగులోకి మారుతుంది.

8. నాలుక పాలిపోయి తెల్లనిగా ఉంటే మీ నోటి శుభ్రత తక్కువగా ఉందని అర్ధం. అంతేకాదు.. మీరు శరీరానికి తగిన నీరుని అందించడంలేదు.. మీ శరీరం డీహైడ్రేషన్ బారినపడిందని సంకేతం. సీజనల్ వ్యాధి అయిన ఫ్లూ బారిన పడివారికి కూడా కొన్ని సార్లు నాలిక తెల్లగా మారుతుంది. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తక్కువగా ఉందని అర్థం. ఐరన్ ప్రోటీన్ల లోపానికి కూడా ఇదే సంకేతం. కనుక నాలుక తెల్లగా ఉంటె వారు తినే ఆహారంలో పోషకాలు ప్రోటీన్లు ఉండేలా చూసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.

ఇలా వివిధ రంగుల్లో ఉన్న నాలుక వివిధ అనారోగ్య సమస్యలకు సంకేతమనమాట..ఓ సారి మీ నాలుక కూడా ఏ రంగులో ఉందో టెస్ట్ చేయండి. ఇది చదివాక కచ్చితంగా చేసుకోవాలని ఆలోచన మీకు వస్తుందిలే..!

– Triveni Buskarowthu