చలికాలం వచ్చేసింది.. చర్మ సమస్యలకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకోండి.

చలికాలం సమీపిస్తున్న ప్రస్తుత సమయంలో చర్మ సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చర్మానికి తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే చర్మ సమస్యలు చికాకుని కలిగించి ఇబ్బంది పెడుతుంటాయి. అందుకే ఆరోగ్యకరమైన చర్మం కోసం తగిన జాగ్రత్తలు తీసుకోక తప్పదు.

ముందుగా, ఎక్కువ సేపు స్నానం చేయవద్దు. వేసవిలో చేసినట్టు ఎక్కువ సేపు స్నానం చేయడం సరికాదు. అంతే కాదు చల్లని నీటితో అస్సలు స్నానం చేయవద్దు. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం ఉత్తమం.

మాయిశ్చరైజర్ మర్దన చేసుకోవాలి..

స్నానం చేసిన తర్వాత కొద్ది సేపటికే చర్మం పూర్తిగా పొడిబారినట్టు కనిపిస్తుంది. ఇలాంటి టైమ్ లో మాయిశ్చరైజర్ వాడటం తప్పనిసరి. మాయిశ్చరైజర్ చర్మాన్ని తేమగా ఉంచి ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ విధంగా రెండు సార్లు చేయాలి. పొద్దున్న స్నానం చేసిన తర్వాత ఒకసారి, పడుకునే ముందు మరోసారి మాయిశ్చరైజర్ తో మర్దన చేసుకోవాలి. మాయిశ్చరైజర్ కాకపోయినా కనీసం కొబ్బరినూనె వాడటం మంచిదే.

ఇంకా సన్ స్క్రీన్ వాడటం మరిచిపోవద్దు. బయటకి వెళ్ళేముమ్దు ఖచ్చితంగా సన్ స్క్రీన్ వాడాలి. సూర్యుని నుండి వచ్చే అతినీల లోహిత కిరణాలు చర్మానికి ఇబ్బందులు కలిగించి ముడుతలు వచ్చేలా చేస్తాయి. సన్ స్క్రీన్ లోషన్, ఇలాంటి ముడుతల నుండి కాపాడి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

సరైన నిద్ర, సరైన ఆహారం, కావాల్సనన్ని నీళ్ళు తీసుకోవాలి. కనీసం ఎనిమిది గంటల నిద్ర చాలా అవసరం. లేదంటే చర్మ సమస్యలు పెరుగుతాయి. నిద్రలో ఉన్నప్పుడు చర్మం తనని తాను రిపేర్ చేసుకుంటూ ఉంటుంది. చెడిపోయిన కణాలు తొలగిపోయి వాటి స్థానంలో కొత్త కణాలు ఏర్పడతాయి.

మీ శరీరానికి తగిన సబ్బుని వాడటం మంచిది. వేసవిలో లాగా చలికాలంలో ఒకే రకమైన సబ్బు వాడకుండా మీ శరీరానికి ఏది సరిగ్గా ఉంటుందో తెలుసుకుని మరీ వాడాలి.