అడుగేస్తున్న ప్రతీసారి పడిపోతున్నావా? ఐతే ఎగరడం నేర్చుకోవాల్సిందే..

-

జీవితంలో ఏదైనా కొత్తది సాధించడానికి ముందు ముందుగా చిన్న చిన్న అడుగులు వేయాల్సి ఉంటుంది. ఆ అడుగుల బలం ఎక్కువైనప్పుడే పరుగు ప్రారంభమవుతుంది. నీ అడుగు సరిగ్గా పడకపోతే పరుగు కష్టమవుతుంది. దేనిలోనైనా ముందుకు వెళ్ళాలన్న ఆలోచన మీకుంటే దాని కోసం కష్టపడతారు. అందులో మెళకువలన్నీ నేర్చుకుంటారు. అయినా కానీ ఇబ్బందులు ఎదురై మిమ్మల్ని అడుగులు వేయకుండా మీ దారిని ఇబ్బందికరంగా మార్చేస్తుంటే కొత్త దారుల్లోకి వెళ్ళాలని డిసైడ్ అవుతారు.

ఆ కొత్త దారి గురించి మీకేమీ తెలియదు. అక్కడ మళ్ళీ చిన్న చిన్న అడుగులే వేయాల్సి ఉంటుంది. ఆ అడుగులు పెద్దగా మారడానికి చాలా టైమ్ కావాలి. టైమ్ అవుతుందని మరలా మరో దారిలోకి వెళ్తుంటే అది కూడా కొత్త దారే అవుతుంది. ఇలా కొన్ని రోజులకి మీరు వేసిన ప్రతీ దారీ కొత్తగానే ఉంటుంది. అక్కడంతా మీ అడుగులు కొద్ది దూరం వరకే ఉంటాయి. మీరు అడుగులు ఆగిపోయాక మిగిలి ఉన్న దారిలో ఏవేవో కొత్త కొత్త అడుగులు మీకు కనిపిస్తుంటాయి.

మీరు సాధించలేనిది అవతలి వాళ్ళు సాధించగలిగారన్న కోపం కలుగుతుంది. అప్పుడెందుకు వదిలేసానన్న బాధ ఎక్కువై మీ మీద అసహ్యం కలగవచ్చు. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం వదిలేస్తారు. తిట్టుకుంటూ, మీ వల్ల కాదనుకుని బాధపడుతూ కాలం వెళ్ళదీస్తారే తప్ప, ప్రస్తుతం ప్రయాణిస్తున్న దారినైనా మీకు కావాల్సినట్టుగా మార్చుకోవచ్చని, ఆ దారిలో అడ్డు వచ్చే ముళ్ళనన్నింటినీ తొలగించే అవకాశం ఉందని కనుక్కోరు.

అస్తమానం మీరు ఇంతకు ముందు నడవలేకపోయిన దారినే తలచుకుంటూ కాలం వెళ్ళదీస్తారు. ఒక్క విషయం గుర్తుంచుకోండి. మీరు వెళ్తున్న దారిలో అడ్డుగా రాళ్ళు రప్పలు, ముళ్ళ కంపలు ఉండవచ్చు. అవి ఉన్నాయి కదా అని చెప్పి దారి మళ్ళించడం చేయడం కరెక్ట్ కాదు. సామాన్యులు ఈ విషయంలో ముళ్ళని జరిపే ప్రయత్నం చేస్తారు. తెలివిగలవారు ఆ ముళ్ళకంప మీద నుండి ఎగిరి, దాని అవతల దారిలో పడిపోతాడు. మీరలా ఎగరలేకపోవడానికి కారణాలేంటో తెలుసుకోవాల్సింది మీరే.

Read more RELATED
Recommended to you

Latest news