జీవితానికి లక్ష్యం ఉండాలా? లక్ష్యం లేని వాళ్ళ జీవితాలు వ్యర్థమేనా? ఈ కథ చదవండి.

-

ఒకానొక ఊరిలో నదీతీరాన తన కొడుకుతో పాటు ఒక వ్యక్తి జీవనం కొనసాగిస్తున్నాడు. ఆ వ్యక్తికి ఆ ప్రాంతంలో మంచి పేరుంది. కానీ ఆ వ్యక్తికి మాత్రం తన కొడుకు జీవితం మీద బాధ కలిగేది. పొద్దున్న లేవగానే తిని, స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటూ కాలం గడుపుతున్న కొడుకు ఏమైపోతాడో అని బాధపడేవాడు. రోజులు గడుస్తున్నాయి. అప్పుడు ఆ వ్యక్తికి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే కొడుకుని పిలిచి, చేతికి ఒక సంచి ఇచ్చాడు. ఆ సంచిలో డబ్బులు, కొన్ని ఆహార పదార్థాలు, ఒక మ్యాపు ఉన్నాయి.

ఈ మ్యాపు గుండా వెళితే నీకు నిధి దొరుకుతుంది అని చెప్పగానే కొడుకు బయల్దేరాడు. ఊర్లు, నదులు, కొండలు, అడవులు దాటి వెళ్ళసాగాడు. కొన్ని రోజులకి బ్యాగులో ఉన్న సామాన్లు అయిపోయాయి. అప్పుడు దారిలో కనిపించే వాళ్ళు సాయం చేసారు. రుతువులు మారాయి. అలా చివరకు ఒక కొండ మీద చెట్టుకింద నిధి ఉందని గ్రహించి తవ్వడం మొదలెట్టాడు. చెమట్లు కక్కుతూ తవ్వుతున్నా నిధి జాడ కనిపించడం లేదు. రెండు రోజులు ప్రయత్నం చేసి, ఇక విసిగిపోయి విరమించుకుని వెనుకకు బయల్దేరాడు.

అప్పుడు దారి గుండా పోతూ పోతూ ప్రకృతిని గమనించసాగాడు. చుట్టూ కొండలు, వచ్చేటపుడు తనకి సాయం చేసిన వాళ్ళని కలుసుకున్నాడు. మాట్లాడాడు. రుతువు మారుతుంటే సంతోషించాడు. క్రూరమృగాల నుండి కాపాడుకోవడం ఎలాగో నేర్చుకున్నాడు. ఆహారం కోసం తిప్పలు పడ్డాడు. ఈ ప్రయాణంలో మోసం చేసేవాళ్ళు, స్నేహితులు, మంచి ముసుగులో మోసగాళ్ళు అందరినీ కలుసుకున్నాడు. ఈ ప్రయాణం రెండేళ్ళు సాగింది. రెండేళ్ల తర్వాత తీరా ఇంటికి వచ్చి నాన్నా, నువ్వు చెప్పిని నిధి దొరకలేదు. నేను వెళ్ళక ముందే దాన్ని ఎవరో తీసుకుపోయి ఉంటారు అన్నాడు.

దాని గురించి పెద్దగా పట్టించుకోని నాన్న, నీ ప్రయాణం ఎలా సాగింది అని అడిగాడు. వెళ్ళేటపుడు నిధి కోసమని ఆదరాబాదరగా వెళ్ళాను. వచ్చేటపుడు మాత్రం ఆనందించాను అన్నాడు. అప్పుడు తండ్రి, నిజానికి అక్కడ ఎలాంటి నిధి లేదు. ఎప్పుడైతే ఒక లక్ష్యం కోసం పరుగు పెడ్తావో చుట్టూ ఉన్న వాటి గురించి పట్టించుకోవడం మానేస్తావు. జీవితం అంటే అది కాదు. ఆనందించడం, అనుభవించడం. కొత్త రుచుల్ని చూసుకుంటూ ఆ అనుభవాన్ని మరింత పెంచుకోవాలని హితవు పలికాడు.

లైఫ్ లో వచ్చే ప్రతీ అనుభవాన్ని ఆనందించాలి. ఒక్కదానికోసం జీవితాన్ని తాకట్టు పెట్టవద్దు అని సమాధానం ఇచ్చాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version