ఆ అధికారి ముందు చూపుతో కొన్ని వేల మందిని తుపాను బారి నుంచి ర‌క్షించారు..!

-

విష్ణుప‌ద సేథి చాలా చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించ‌డం వ‌ల్ల పెద్ద ఎత్తున ప్రాణ న‌ష్టం త‌ప్పింది. అయినా కొంద‌రు చ‌నిపోవ‌డంతో ఆయ‌న కొంత విచారానికి లోన‌య్యారు.

ఏపీలోని కొన్ని ప్రాంతాలతోపాటు ఒడిశాలోని ప‌లు ప్రాంతాల్లో ఇటీవ‌ల వ‌చ్చిన ఫొని తుఫాను ఎంతటి న‌ష్టాన్ని క‌లిగించిందో అంద‌రికీ తెలిసిందే. తుపాను భీభ‌త్సానికి అంతా అత‌లాకుత‌లం అయిపోయింది. గంట‌కు 200 కిలోమీట‌ర్ల‌కు పైగా గాలులు వీయ‌డంతోపాటు భారీ వ‌ర్షాల కార‌ణంగా ఒడిశాలోని తీర‌ప్రాంతం అల్లాడిపోయింది. ఈ క్ర‌మంలోనే అనేక ఇండ్లు నేల‌మ‌ట్టం అయ్యాయి. వేల సంఖ్య‌లో చెట్లు కూలిపోగా, విద్యుత్ స్తంభాలు నేల‌కొరిగాయి. అయిన‌ప్ప‌టికీ తుపాను వ‌ల్ల కేవ‌లం 64 మంది మాత్ర‌మే చ‌నిపోయారు. గ‌తంలో ఇలాంటి తుపాను వ‌ల్లే ఒడిశాలో 10వేల మంది చ‌నిపోగా ఇప్పుడు ప్రాణ న‌ష్టం చాలా త‌క్కువ‌గా సంభ‌వించింది. అయితే ఇప్పుడు ఇంత త‌క్కువ‌గా ప్రాణ న‌ష్టం ఉండ‌డానికి కార‌ణం మాత్రం.. ఆ అధికారే.. ఆయ‌న చొర‌వ వ‌ల్లే ఎన్నో వేల మంది ప్రాణాలు కాపాడ‌గ‌లిగారు. ఇంత‌కీ ఆయ‌న ఎవ‌రంటే…

ఒడిశా స్పెష‌ల్ రిలీఫ్ క‌మిష‌న‌ర్ విష్ణుప‌ద సేథి చూపిన చొర‌వ వ‌ల్లే ఒడిశాలో భారీ సంఖ్య‌లో జ‌రగాల్సిన ప్రాణ‌న‌ష్టం త‌ప్పింది. అయితే ఇంత‌కీ అస‌లు ఆయ‌న ఏం చేశారంటే… ఫొని తుపాను ప్ర‌భావం గురించి తెలిసిన వెంట‌నే విష్ణుప‌ద సేథి ఏమాత్రం ఆల‌స్యం చేయ‌లేదు. వెంట‌నే స్పందించారు. ప‌క్కా ప్రణాళిక సిద్ధం చేశారు. దాంతోనే ముందుకు సాగారు. లోత‌ట్టు ప్రాంతాల్లో ఉండే ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు. అలాగే చాలా మందిని స‌హాయక శిబిరాల‌కు త‌ర‌లించారు. దీంతోపాటు 50వేల మంది వాలంటీర్ల‌ను ఆయ‌న సిద్ధం చేశారు. అత్య‌వ‌స‌ర సిబ్బంది, పోలీసులు, ప‌డ‌వ‌లు, బ‌స్సులు, రైళ్ల‌ను కూడా సిద్ధంగా ఉంచారు.

అలాగే తుపాను ప్ర‌భావం ఎలా ఉంటుంది, ఏయే ప్రాంతాలు తుపాను బారిన ప‌డ‌తాయి.. అనే వివ‌రాల‌ను కూడా వీలైనన్ని ప్ర‌చార మాధ్య‌మాల ద్వారా తెలియ‌జేశారు. లౌడ్ స్పీక‌ర్లు, సైర‌న్లు మోగిస్తూ ప్ర‌జ‌ల‌ను అల‌ర్ట్ చేశారు. టీవీల్లో ప్ర‌క‌ట‌న‌లు కూడా ఇచ్చారు. అలాగే స‌హాయ శిబిరాలు ఎక్క‌డ ఉన్నాయి, వాటిని ఎలా చేరుకోవాలి అన్న వివ‌రాల‌ను తెలియ‌జేస్తూ సుమారుగా 2 కోట్ల ఎస్ఎంఎస్‌లు కూడా పంపారు. దీంతో వాటికి ప్ర‌జ‌ల నుంచి పెద్ద ఎత్తున స్పంద‌న ల‌భించింది. ఈ క్ర‌మంలోనే పెద్ద ఎత్తున ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించి వారి ప్రాణాల‌ను కాపాడారు.

అలా విష్ణుప‌ద సేథి చాలా చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించ‌డం వ‌ల్ల పెద్ద ఎత్తున ప్రాణ న‌ష్టం త‌ప్పింది. అయినా కొంద‌రు చ‌నిపోవ‌డంతో ఆయ‌న కొంత విచారానికి లోన‌య్యారు. తుపాను వ‌ల్ల అస‌లు ఏ మ‌నిషి ప్రాణ‌మూ పోకూడ‌ద‌ని ఆయ‌న చివ‌రి వ‌ర‌కు త‌పించారు. కానీ దైవ లీల‌ను ఎవ‌రూ త‌ప్పించ‌లేరు క‌దా. అయిన‌ప్ప‌టికీ కొన్ని వేల మందిని కాపాడి విష్ణుప‌ద సేథి నిజంగా దేవుడే అయ్యార‌ని చెప్ప‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు క‌దా..!

Read more RELATED
Recommended to you

Latest news