Stop Drugs : డ్రగ్స్ ,గంజాయి కూడా అమ్మండి ప్లీజ్..!

-

నా కొడుకుతో నేను సినిమాకు వెళ్ళగానే స్క్రీన్ మీద ద్రావిడ్ కనపడి, క్యాచ్ అవుట్ అవకండి, రనౌట్ అవ్వకండి అంటూ చెప్తూచెప్తున్నాడు.. అది చూసి నేను నవ్వా.. నా కొడుకు సీరియస్ గా చూస్తున్నాడు . ఒక మాట అనేసాడు చూస్తూ చూస్తూ, నాన్న వీడు ఆడినప్పుడు బోర్ కొట్టించాడు. ఇప్పుడు కూడా బోర్ కొట్టిస్తున్నాడు అన్నాడు.

ఇంతలో మరో యాడ్ వచ్చింది. జర్దా, పాన్, పాన్ మసాలా తిని రేఖ తన రెండు గాజులు అమ్ముకుంది అని. దాన్ని చూసి బాధ అనిపించింది. కాని లోపల మాత్రం సినిమా చూస్తున్న౦త సేపు చిరాకు చిరాకు గా సినిమా చూడబుద్హి కాలేదు. నా కొడుకు సినిమా ఎంజాయ్ చేస్తున్నాడు. నేను వాడి అమాయకపు నవ్వు చూసి బాధపడుతున్నాను. అవును నేను బాధపడుతున్నాను.

అంత ఖర్చు పెట్టి ప్రకటనల రూపంలో సలహాలు ఇవ్వడం ఒక వింత అయితే, తయారిని ఆపకుండా తాగే వాడ్ని ఆగమని చెప్పడం ఏంటి…? తయారు చేసే వాడు మీకు సన్నిహితుడు అయి ఉండవచ్చు, అలాంటప్పుడు అసలు వాటి తయారినే నిషేధించాలి కదా మాస్టారు…? నా కొడుకుని చూసి నేను ఎందుకు బాధపడ్డానో తెలుసా…? వాడు దగ్గుతున్నాడు. రాత్రిళ్ళు వాడికి నిద్ర ఉండటం లేదు.

వాడికి 16 ఏళ్ళ వయసులోనే స్కూల్ దగ్గర ఉన్న పాన్ షాప్ వద్ద అలవాటు అయింది. ఇప్పుడు వాడికి 27 ఏళ్ళు. హైదరాబాద్ లో ఒక పెద్ద ఆస్పత్రిలో జాయిన్ చేసాను. బంధువుల ఇంటి దగ్గరే ఉంటున్నాం. బంధువులు అంటే నా కూతురు ఇంటి దగ్గర. దాని తమ్ముడికి ట్రీట్మెంట్ కదా… భర్తను ఒప్పించింది. నా అల్లుడు కూడా మంచోడే. మమ్మల్ని బాగా చూసుకుంటున్నాడు.

అయ్యా వాడు సినిమాకు తీసుకెళ్లమంటున్నాడు నాకు ఏం తెలీదు అనగానే… ఒక కారు బుక్ చేసి నన్ను, నా కొడుకుని సినిమాకు తీసుకువెళ్ళాడు. నా కొడుకు జీవితం అయిపోయిందని వైద్యులు కూడా చెప్పారు. ఉన్నదీ ఒక్కడే అందుకే నాలుగు రోజులు బ్రతుకుతాడని పొలం అమ్మి వైద్యం చేయిస్తున్నాను. నా కడుపు మండే రోజు దగ్గరలోనే ఉంది అనే విషయం నాకు అర్ధమవుతుంది.

అందుకే బాధ తన్నుకొస్తుంది. తయారు చేసే వాడికి రాయితీలు ఇస్తున్న ప్రభుత్వాలు, తాగే వాడికి సలహాలు ఇస్తున్నాయి. ధూమ పానం క్యాన్సర్ కారకం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం అంటున్నారు. నిషేధించడానికి ఎందుకు సాహసం చేయడం లేదు…? ఎవరిని పిచ్చోళ్ళు చేస్తున్నాయి ప్రభుత్వాలు. నా కొడుకుతో పాటు ఎందరో కొడుకులు ఇలాగే జీవితాలు నాశనం చేసుకుంటున్నారు.

హైదరాబాద్ చదువులకు వెళ్ళారు, అనారోగ్యంతో ఇళ్ళకు వస్తున్నారు. స్కూల్ దగ్గర, హాస్టల్ దగ్గర, ఆఫీసుల దగ్గర ఇలా ఎక్కడ చూసినా పాన్ షాప్ లు ఉంటున్నాయి. ఇవి అనారోగ్యమే డ్రగ్స్ కూడా అనారోగ్యమే కదా…? అలాంటప్పుడు డ్రగ్స్ నిషేధించి వాటిని ఎందుకు…? తాగొద్దని సలహా ఇస్తున్నారు. కాబట్టి డ్రగ్స్ కూడా అమ్మండి. గంజాయి పంటలను ప్రోత్సహించండి.

సిగరెట్ తయారికి రాయితీలు ఇచ్చినప్పుడు, మద్యం మీద ఆదాయం చూసినప్పుడు గంజాయి మీద కూడా పన్నులు విధించండి. ఉంచితే అన్ని ఉంచండి లేదా అన్ని నిషేధించంది. ప్రజాస్వామ్యం సమన్యాయం చేయండి. ఇకపోతే బీడీ తయారిని ఉంచండి. ఎందుకంటే గ్రామాల్లో బీడీ తయారు చేసుకునే వాళ్ళు, అడవుల్లో ఉండే వాళ్లకు అది జీవనాధారం, దానికి తోడు బీడీ తాగేది పాతతరం, వాళ్లకు 50 ఏళ్ళు పైనే ఉన్నాయి.

కాబట్టి అది పెద్ద ఇబ్బంది కాదు. వేలాది మంది బిడ్డలు ఇప్పుడు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వేలాది మంది పిల్లలు తల్లి తండ్రులకు తీరని శోకాన్ని మిగులుస్తున్నారు. వాళ్ళ వయసుకి తెలుసుకోలేకపోతున్నారు. వాళ్ళు తెలుసుకునేలోపు అంతా నాశానమైపోతుంది. కాబట్టి ప్రభుత్వాలు దీని మీద దృష్టి పెట్టండి. దయచేసి ఆపితే తయారీని ఆపండి. బాంబులు తయారీ కొనసాగించి ఉగ్రవాదులను అరెస్ట్ చేస్తే ఏం ఉపయోగం అండి…? అన్నట్టు నా కొడుకు చచ్చిపోయాడు. నా అల్లుడే కొడుకయ్యాడు.

ప్రతీ సంవత్సరం అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక దినం వస్తుంది.. ఆ ఒక్కరోజే నిషేధించాలంటూ రోడ్డు మీదకి వస్తుంటారు.. అలాకాకుండా ఈ మత్తు పదార్థాలు మొత్తంగా నిషేధించేవరకు పోరాటం చెయ్యరు…

Read more RELATED
Recommended to you

Latest news