టాకింగ్ హ్యాండ్స్.. ఆ రెస్టారెంట్ లో ఎవ్వరూ మాట్లాడరు… !

-

హైదరాబాద్.. దేశంలోనే ఈ భాగ్యనగరానిది ప్రత్యేక స్థానం. భారత్ ను సందర్శించే ఎంతో మంది హైదరాబాద్ ను చూడకుండా వెళ్లరు. హైదరాబాద్ ఎన్నో భిన్న సంస్కృతుల నిలయం. అందరినీ అక్కున చేర్చుకునే హృదయం హైదరాబాదీల సొంతం. ఇక్కడ ఉంటే సొంత ఊళ్లో ఉన్నట్టే అనిపిస్తుంది. ఇది మన ఊరే అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇటువంటి ఫీలింగ్ మరెక్కడ ఉన్నా కలుగదు. మంచి వాతావరణం.. డబ్బులు సంపాదించుకోవడానికి బోలెడు పనులు.. వ్యాపారానికి ప్రభుత్వ సహకారం.. ఇలా అన్ని విషయాల్లోనూ మేటి అనిపించుకుంటున్నది హైదరాబాద్. అందుకే.. హైదరాబాద్ దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే తన ప్రత్యేకతను చాటుకుంటున్నది.

సరే.. ఇక అసలు మ్యాటర్ లోకి వద్దాం. ఈ మహానగరంలో మీరు ఎన్నో రెస్టారెంట్లను చూసుంటారు. వరల్డ్ ఫేమస్ ప్యారడైజ్ హోటల్, బవార్చి, ఇంకా స్టార్ హోటల్స్ తాజ్ కృష్ణ, తాజ్ బంజారా… ఇలా బొచ్చెడు హోటళ్లను మీరు చూసుంటారు కానీ.. ఇటువంటి హోటల్ ను ఎప్పుడూ చూసి ఉండరు. హైదరాబాద్ లోనే కాదు ప్రపంచంలోనే ఇటువంటి హోటల్ లేదు. ఇంతకీ ఏంటి ఆ హోటల్.. ఏంటి దాని స్పెషాలిటీ.. అని అంటారా? దాని పేరు టాకింగ్ హ్యాండ్స్. అంటే చేతులే మాట్లాడుతాయి. అవును నిజంగానే ఆ హోటల్ లో చేతులే మాట్లాడుతయి. ఆ హోటల్ పిన్ డ్రాప్ సైలెంట్ గా ఉంటుంది. మీరు బొక్క కొరికినా.. ఆ సౌండ్ కూడా వినిపిస్తుంది. అంత సైలెన్స్ అన్నమాట. ఎందుకంటే.. అక్కడ పనిచేసే వాళ్లంతా మూగవాళ్లు. వాళ్లకు మాటలు రావు. మూగ, చెవిటి వాళ్లందరితో కలిసి ఏర్పాటు చేసిందే ఈ టాకింగ్ హ్యాండ్స్ రెస్టారెంట్. రెస్టారెంట్ లో వంట వాళ్ల దగ్గర నుంచి క్యాషియర్, వెయిటర్, హౌస్ కీపింగ్, మేనేజర్ ఇలా ప్రతి ఒక్కరు బధిరులే. మొత్తం 25 మంది సిబ్బంది ఆరెస్టారెంట్ లో పని చేస్తున్నారు. ఈ రెస్టారెంట్ ను తెలంగాణ టూరిజం శాఖ సహకారంతో డెఫ్ ఎనేబుల్డ్ ఫౌండేషన్ ఏర్పాటు చేసింది. బధిరులకు ఉపాధి కల్పించి.. వారిని ఆదుకోవడం కోసమే ఈ రెస్టారెంట్ ను ఏర్పాటు చేశారు. ఇంతకీ ఈ రెస్టారెంట్ ఎక్కడుంది అని అంటారా. బేగంపేటలోని పర్యాటక బవన్ లో ఉంది.

ఇదంతా ఓకే కానీ.. రెస్టారెంట్ కు వెళ్లే కస్టమర్లకు బధిరుల భాష రాదు కదా.. మరి ఆర్డర్ ఎలా ఇవ్వాలి.. ఏదైనా అడగాలంటే ఎలా? అనే డౌట్స్ వస్తున్నాయా మీకు. మీరు రెస్టారెంట్ కు వెళ్లి కూర్చోగానే మీకు మెనూ కార్డు ఇస్తారు. మీ టేబుల్ పై ఓ బల్బ్ ఉంటుంది. దాన్ని నొక్కగానే వెయిటర్ మీదగ్గరికి వస్తాడు. అతడికి మెనూ కార్డులోని ఐటెమ్ ను చూపిస్తే చాలు తీసుకొస్తాడు. ఇంకా వెయిటర్స్ తో ఎలా మాట్లాడాలి అనే దాని కోసం అక్కడ ఉన్న స్క్రీన్లపై కొన్ని పోస్టర్స్ అంటించి ఉంటాయి. వాటిని చూసి వాటి ద్వారా వెయిటర్స్ ను పిలవడమే. గత సంవత్సరం ఈ రెస్టారెంట్ ప్రారంభమయింది. ప్రారంభం అయిన దగ్గర్నుంచి ఈ రెస్టారెంట్ కు కస్టమర్లు క్యూ కడుతున్నారు. రెస్టారెంట్ లో ఫుడ్డు టేస్ట్ సూపర్బ్ అంటూ… రెస్టారెంట్ కు వెళ్లి ఓ కొత్త భాషను నేర్చుకుంటున్నామంటూ కస్టమర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి.. మీరు కూడా హైదరాబాద్ లో ఉంటే ఓసారి టాకింగ్ హ్యాండ్స్ కు వెళ్లి రండి..

Read more RELATED
Recommended to you

Latest news