మొబైల్ గేమ్స్ ఆడే సత్తా ఉంటే.. రూ.15 లక్షలు మీవే..!

మీరు గేమ్స్ బాగా ఆడగలరా..? స్మార్ట్‌ఫోన్లలో ఎప్పుడూ గేమ్స్ ఆడుతుంటారా..? అయితే ఈ అవకాశం మీకోసమే. ఈ గేమ్ ఆడి ఏకంగా రూ.15 లక్షల ప్రైజ్ మనీని గెలుచుకోవచ్చు. ఎలా అంటే… టెన్సెంట్ గేమ్స్ అనే గేమింగ్ కంపెనీ డెవలప్ చేసిన ప్లేయర్ అన్‌నౌన్స్ బ్యాటిల్‌గ్రౌండ్స్ (పీయూబీజీ) గేమ్‌ను ఆడి అందరికన్నా మొదటి స్థానంలో నిలిస్తే ఏకంగా రూ.15 లక్షలను గెలుచుకోవచ్చు.

పీయూబీజీ గేమ్ ఇప్పటికే ప‌లు ప్లాట్‌ఫాంలపై లభిస్తుండగా, మొన్నీ మధ్యే ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫాంలపై విడుదలైంది. అయితే ఈ గేమ్‌కు గాను ఈ నెల 26వ తేదీ నుంచి అక్టోబర్ 21వ తేదీ వరకు చాంపియన్‌షిప్ టోర్నమెంట్‌ను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా కస్టమర్లు తమ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్లలో పీయూబీజీ గేమ్‌ను ఆడాలి. ఈ క్రమంలో బెంగూళురులో అక్టోబర్ 20, 21వ తేదీల్లో ఫైనల్ పోటీలను నిర్వహిస్తారు. అందులో ప్రథమ స్థానంలో నిలిచిన వారికి రూ.15 లక్షలను అందజేస్తారు. ద్వితీయ బహుమతిగా రూ.5 లక్షలు, తృతీయ బహుమతి కింద రూ.3 లక్షలను ఇస్తారు. ఇక టాప్ 10 లో నిలిచిన వారికి కూడా నగదు బహుమతులను అందిస్తారు. టాప్ 10 లో చివరి స్థానంలో ఉన్నవారికి రూ.50వేల వరకు అందుతాయి.

ఒప్పో మొబైల్స్ భాగస్వామ్యంతో టెన్సెంట్ గేమ్స్ ఈ చాంపియన్ షిప్‌ను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా 6 స్పెషల్ అచీవ్‌మెంట్ అవార్డులను కూడా అందివ్వనున్నారు. ఇక ఈ చాంపియన్ షిప్‌లో పాల్గొనదలచిన వారు pubgmobile.in అనే వెబ్‌సైట్‌ను సందర్శించి చాంపియన్ షిప్ కోసం రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 21వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లను స్వీకరిస్తారు. మరికెందుకాలస్యం.. మొబైల్ గేమ్స్ ఆడే సత్తా మీలో ఉంటే ఏకంగా రూ.15 లక్షలను గెలుచుకోవచ్చు. అయితే.. ఈ అవకాశం కేవలం కాలేజీ చదువుతున్న విద్యార్థలకు మాత్రమే సుమా..!