మన శరీరానికి కావల్సిన పోషక పదార్థాల్లో ఐరన్ కూడా ఒకటి. ఐరన్ వల్ల మన శరీరంలో రక్తం బాగా తయారవుతుంది. అయితే ఐరన్ ఉన్న ఆహారాలను తీసుకుంటే కేవలం ఆ ఒక్క ప్రయోజనం మాత్రమే కలుగుతుందని చాలా మంది అనుకుంటారు. అయితే నిజానికి ఐరన్ వల్ల రక్తం బాగా ఉత్పత్తి అవడమే కాదు, ఇంకా పలు ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. మన శరీరంలో ఎర్ర రక్త కణాల జీవిత కాలం 120 రోజులు. ఆ తరువాత అవి చనిపోయి కొత్త కణాలు ఏర్పడుతాయి. అయితే అవి ఎలా ఏర్పడాలంటే.. ఐరన్ ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి.
2. ఎర్ర రక్త కణాల్లో ఉండే హిమోగ్లోబిన్ మన శరీరంలోని ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్‌ను ఇతర శరీర భాగాలకు చేరవేస్తుంది. అయితే ఐరన్ తగ్గితే హిమోగ్లోబిన్ కూడా తగ్గుతుంది. దీంతో శరీర అవయవాలకు ఆక్సిజన్ సరిగ్గా అందదు. దీని వల్ల ఆయా భాగాల్లో ఉండే కణాలు చనిపోతాయి. శ్వాసతీసుకోవడంలో సమస్యలు, అలసట, తలతిరిగినట్లు ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కనుక ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాలను నిత్యం తీసుకుంటే ఈ సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.
3. శరీరంలో ఐరన్ స్థాయిలు తగ్గితే ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగి టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశం ఉంటుందని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో వెల్లడైంది.
4. ఐరన్ ఉన్న ఆహారాలను నిత్యం తీసుకోవడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
5. శరీరంలో ఐరన్ తగినంత ఉంటే మెదడు సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి.
6. చిన్నారులకు ఐరన్ ఉన్న ఆహారాలను ఇవ్వడం వల్ల వారి మెదడు మరింత యాక్టివ్‌గా పనిచేస్తుందని సైంటిస్టుల అధ్యయనాల్లో వెల్లడైంది.
7. ఐరన్ లోపిస్తే చర్మం, వెంట్రుకల సమస్యలు కూడా వస్తాయి. కనుక నిత్యం ఐరన్ ఉండే ఆహారాలను తినడం వల్ల ఆయా సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.
ఇక 6 నెలల లోపు వయస్సు ఉన్న చిన్నారులకు నిత్యం 0.27 మిల్లీగ్రాముల ఐరన్ అవసరం. అదే 7 నుంచి 12 నెలలు అయితే 11 ఎంజీ, 1 నుంచి 3 ఏళ్లు అయితే 7 ఎంజీ, 4 నుంచి 8 ఏళ్లు అయితే 10 ఎంజీ, 9 నుంచి 13 అయితే 8 ఎంజీ, 14 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారికి 15 ఎంజీ వరకు, 19 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారికి 8 నుంచి 18 ఎంజీ వరకు, 51 ఏళ్లు పైబడిన వారికి నిత్యం 8 ఎంజీ ఐరన్ అవసరం అవుతుంది.
ఐరన్ మనకు మటన్, చికెన్, పోర్క్, లివర్, సోయా బీన్స్, గోధుమలు, పప్పులు, ఓట్‌మీల్, తృణధాన్యాలు, పాలకూర, డ్రై ఫ్రూట్స్, బ్రొకొలి, ఆపిల్స్ తదితర అనేక పదార్థాల్లో లభిస్తుంది. వీటిని తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఐరన్ లోపం రాకుండా చూసుకోవచ్చు.