పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై ఎట్టకేలకు ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో గురువారం సాయంత్రం కేసు నమోదుచేశారు. ఏలూరు రైల్వేస్టేషన్ సమీపంలోని ఐఎంఎల్ డిపో హమాలీ మేస్త్రి జాన్ వ్యవహారంలో ఎమ్మెల్యే తన ఇంటికి పిలిపించుకుని కొట్టి, కులం పేరుతో దూషించారనే ఆరోపణల వెళ్లువెత్తిన నేపథ్యంలో ఈ ఘటనపై కార్మిక, దళిత సంఘాలు, వామపక్ష ఇతర రాజకీయ పార్టీలు గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేయటంతో అధికారులు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం, ఐపీసీ 323 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే తో పాటు రవి, చుక్కా వెంకటేశ్వరరావుతోపాటు ముగ్గురు గన్‌మెన్‌లపైనా కేసు నమోదు చేశారు.
ఐఎంఎల్ డిపోలో హమాలీ సక్రమంగా పనిచేయక పోవటంతో హమాలీ మేస్త్రి రాచీటి జాన్ అతడిని పనిలోనుంచి తొలగించాడు. ఈ విషయమై హమాలీ ఎమ్మెల్యేను ఆశ్రయించగా.. తొలగించిన కార్మికుడిని తిరిగి పనిలో పెట్టుకోవాలని బెదిరించారు. దీంతో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న అతడిని పనిలో పెట్టుకోవటం కుదరదని జాన్ చెప్పటంతో, ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతనిపై చింతమనేని భౌతికదాడి చేయడంతో పాటు, కులం పేరుతో దూషించాడని జాన్ ఆరోపించాడు.
ఈనెల 10న సంఘటన జరగగా 11న కార్మిక సంఘాలు, వామపక్ష నేతలు, బాధితుడు జాన్ త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుకు ఈనెల 14 వరకూ పోలీసులు కనీసం రశీదు కూడా ఇవ్వలేదు. కేసు నమోదు చేయకపోవటంపై వామపక్ష పార్టీలు, కార్మిక, దళిత సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలన్నీ అఖిలపక్షంగా ఏర్పడి ఉద్యమాన్ని చేపట్టాయి. చింతమనేనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఎస్పీ ఎం.రవిప్రకాష్‌కు బుధవారం వినతిపత్రం సమర్పించారు. దీంతో చేసేదేమిలేక పోలీసులు ఎమ్మెల్యే ప్రభాకర్ పై కేసు నమోదు చేశారు.