భారత సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా తెలుగు వ్యక్తి ఎన్వీ రమణ నియమితులయ్యారు. భారత 48వ సీజే (చీఫ్ జస్టిస్ )గా జస్టిస్ ఎన్వీ రమణను నియమించాలని ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే పంపిన ప్రతిపాదనలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు 48వ సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణను నియమిస్తూ రాష్ట్రపతి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రస్తుతం భారత ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతున్న జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే పదవి కాలం ఏప్రిల్ 23న ముగియనుంది. కాగా ఏప్రిల్ 23న బోబ్డే పదవీ విరమణ చేయనుండగా ఏప్రిల్ 24న జస్టిస్ ఎన్వీ రమణ సీజేఐగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వచ్చే ఏడాది ఆగస్టు 26 (2022) వరకు అంటే 16 నెలల పాటు భారత ప్రధాన న్యాయమూర్తిగా సేవలదించనున్నారు. సుప్రీంకోర్టులో జస్టిస్ బోబ్డే తర్వాత అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా ఎన్వీ రమణను సిఫార్సు చేస్తూ ప్రస్తుత సీజేఐ జస్టిస్ బాబ్డే ప్రతిపాదనలు పంపగా… దానికి కేంద్ర న్యాయశాఖతో పాటు రాష్ట్రపతి కోవింద్ ఆమోదం తెలిపారు.
కాగా ఎన్వీ రమణ స్వస్థలం ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా. 1957 ఆగస్టు 27న జన్మించిన ఆయన 1983లో లాయర్ గా ప్రాక్టీసు మొదలుపెట్టారు. 2000 సంవత్సరం జూన్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులవడంతో పాటు ఢిల్లీ హైకోర్టుకు చీఫ్ జస్టిస్‌గా పని చేసారు. అలానే 2014 ఫిబ్రవరిలో సుప్రీం కోర్టుకు పదోన్నతి పొంది… ప్రస్తుతం సుప్రీం కోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు.