ఆదివారం మావోయిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోయారు అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు. అయన హత్యతో ఒక్కసారిగా అరకులోయలో అలజడి మొదలైంది. గత కొద్ది రోజులుగా ఆయనకోసం మావోయిస్టులు మాటువేసినట్టు తెలుస్తోంది. ఇటీవల వరుసగా ఆంధ్రా ఒడిశా బార్డర్ లో మావోయిస్టుల ఏరివేత, ఎదురు కాల్పులు జరుగుతున్న నేపథ్యంలో మావోయిస్టుల దాడులు ఉండే అవకాశముందని ఇంటలిజెన్స్ వర్గాలు ముందుగానే హెచ్చరించాయి.
ఎక్కడికెక్కడ మావోయిస్టుల కదలికలపై నిఘా ఉంచారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా తమకు సమాచారం ఇవ్వకుండా బయటకు వెళ్లవద్దని ఇంటలిజెన్స్ సూచించింది. కానీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, అయన అనుచరుడైన మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలు ఓ కార్యక్రమం నిమిత్తం లిపిట్టిపుట్టుకు వెళ్లగా అక్కడే మాటువేసి 50 మందికి పైగా మావోయిస్టులు వారిని హతమార్చినట్టు తెలుస్తోంది. వారిలో దాదాపు 30 మంది మహిళా మావోయిస్టులు ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు.