అచ్చెన్న మాట నిజమైతే… టీడీపీ నేతలు చేతకానివారే!

-

దాదాపు ఏడాదిన్న‌ర క్రితం నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌ కుమార్ హ‌యాంలో ప్రారంభ‌మైన ఏపీ ప‌రిష‌త్ ఎన్నిక‌ల పోరు వ్య‌వ‌హారం నిన్న‌టి కౌంటింగ్‌తో తెర‌ప‌డింది. ఈ క్ర‌మంలో ఎన్నో వివాదాలు న‌డిచాయి. న్యాయస్థానల వరకూ మేటర్ వెళ్లింది.. చివ‌రికి కౌంటింగ్‌ కు కోర్టు ప‌చ్చ జెండా ఊపింది. కౌంటింగ్ ముగిసింది. టీడీపీ ఘోర ప‌రాజ‌యాన్ని మూటక‌ట్టుకుంది. కుప్పం, నారావారిప‌ల్లె, నిమ్మ‌కూరు లాంటి చోట్ల కూడా టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. ఈ సమయంలో టీడీపీ నేతలు చెబుతున్న మాటలు… వారి చేతకాని తనాన్ని, ప్రజలు వారికప్పగించిన బాధ్యతలు విస్మరించిన విధానాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి!

తాజాగా విడుదలయిన పరిషత్ ఎన్నికల ఫలితాలపై టీడీపీ అధినేత చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు లోకేశ్ లు మౌనాన్నే తమ బాషగా చేసుకున్నారు! అధికారపక్షాన్ని తప్పుపట్టే సాహసం చేయలేదు.. తమ ఓటమిని అంగీకరించే హుందాతనమూ ప్రదర్శించలేదు. ఇప్పటికే అయోమయంలో ఉన్న కేడర్ కు.. వీరి మౌనం మరో సమస్యగా పరిణమించింది. సమస్యలు పరిష్కరించవలసిన అధినేతలే… ఇలా కార్యకర్తలకు సమస్యలుగా మారుతున్న పరిస్థితి టీడీపీలో దర్శనమివ్వడం.. పార్టీ అస్తమయానికి సూచనగా విశ్లేషించుకోవచ్చు!

వీరిమౌనం సంగతి అలా ఉంటే… పరిషత్ ఎన్నిక ఫలితాలపై టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు మైకులముందుకు వచ్చారు. స్థానిక ఎన్నిక‌ల ఫ‌లితాలు మాత్రమే వైసీపీ ప్ర‌భుత్వంపై ప్ర‌జాభిప్రాయాన్ని వెల్ల‌డించ‌ద‌ని.. టీడీపీ అభ్య‌ర్థుల‌పై దౌర్జ‌న్యాల‌కు దిగి నామినేష‌న్లు వేయ‌కుండా అడ్డుకుని పోలీసుల సాయంతో ఏక‌గ్రీవాలు చేసుకున్నార‌ని విమర్శలు గుప్పించారు. సరిగ్గా ఇక్కడే అచ్చెన్న… తమ చేతకాని తనన్ని ఒప్పుకున్నట్లయ్యిందనే విశ్లేషణలు మొదలైపోయాయి.

ఏపీలో అధికారపక్షం పాలించాలి.. వారు తీసుకునే ప్రజావ్యతిరేక నిర్ణయాలపై ప్రజల తరుపున ప్రతిపక్షం పోరాడాలి! మరి ఏపీలో అధికార ప‌క్షం అన్ని దౌర్జన్యాలు చేస్తుంటే… అడ్డుకోవాల్సిన ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం ఏం చేస్తున్న‌ట్టు? ప్ర‌జాస్వామ్యాన్ని ప్రభుత్వం ఖూనీ చేస్తుంటే , ప‌రిర‌క్షించాల్సిన బాధ్య‌త ప్రతిపక్షం చేవచచ్చి కూర్చుందా? బ‌హిష్క‌ర‌ణ పేరుతో బాధ్య‌త‌ల నుంచి ప్ర‌తిప‌క్షం పారిపోవడమే దీనికి పరిష్కారమా? తమ చేతకాని తనాన్ని.. వైసీపీ బలంగా చెప్పుకోవడం నిస్సిగ్గు చర్య కాదా?

ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా టీడీపీ నేతలపై వస్తున్న ప్రశ్నలివి. పోటీ నుంచి పారిపోయిన వారికి… గెలిచిన వారిని చూసి విమర్శించే హక్కు ఉండదు కదా! ధమ్ముంటే చావో రేవో బరిలోకి దిగి తేల్చుకోవాలి తప్ప.. ఇలాంటి అసమర్థ మాటలవల్ల ఎవరికి ఉపయోగం! ఇప్పటికైనా అధినేతలు, అచ్చెన్నలూ గ్రహించాలి! తాము చేతకానివారమని పరోక్షంగా ఒప్పుకునే పనులు మానేసి.. తాము సత్తా ఉన్నావారమని బరిలోకి దిగి నిరూపించుకోవాలి. ప్రజా సమస్యలపై ఉద్యమించాలి!

-CH Raja

Read more RELATED
Recommended to you

Exit mobile version