భారీగా కుప్పకూలుతున్న అదానీ గ్రూప్ షేర్ల ఎఫెక్ట్ పార్లమెంటుపై పడింది. దీంతో రెండో రోజు ఉభయ సభల కార్యకలాపాలు స్తంభించాయి. అదానీ గ్రూప్ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని పరిశోధక సంస్థ హిండెన్‌బర్గ్ ఆరోపణలపై చర్చ జరపాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) లేదా సీజేఐ ఆధ్వర్యంలోని కమిటీతో దర్యాప్తు జరిపించాలని కోరాయి.
విపక్షాల అభ్యర్థనలను లోక్‌సభ స్పీకర్ నిరాకరించారు. సభ్యులు నిరాధారమైన ఆరోపణలు చేయకూడదన్నారు. మరోవైపు రాజ్యసభ ఛైర్మన్ కూడా విపక్షాల వాయిదా తీర్మానాలను తోసిపుచ్చారు. దాంతో ప్రతిపక్ష నేతలు నినాదాలు చేశారు. ఈ గందరగోళ పరిస్థితుల మధ్య రాజ్యసభ మధ్యాహ్నం 2.30 గంటల వరకు, లోక్‌సభ మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడింది.