ఇంట్లోకి లేదా వ్యక్తిగత అవసరాలకు అప్పుడప్పుడు వస్తువులు అవసరం అవుతుంటాయి. అవి ఏవైనా కావచ్చు.. సమయానికి వాటిని కొనేందుకు చేతిలో డబ్బులు ఉండవు. జీతం వచ్చే వరకు ఆగాల్సి ఉంటుంది. కానీ అలాంటి వారికి డబ్బులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు అమెజాన్, పేటీఎం, మొబిక్విక్‌లు పే లేటర్ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. ఇవి చే బదులు కింద కొంత మొత్తాన్ని అప్పటికప్పుడు అప్పు కింద ఇస్తాయి. వాటిని మరుసటి నెలలో చెల్లించాల్సి ఉంటుంది.
అమెజాన్‌లో పే లేటర్ సదుపాయం వినియోగదారులకు అందుబాటులో ఉంది. దీంతో అమెజాన్‌లో వినియోగదారులు ఏ వస్తువులనైనా కొనుగోలు చేయవచ్చు. కిరాణా సరుకులు, ఎలక్ట్రానిక్స్, ఇతర వస్తువులు వేటినైనా సరే కొనవచ్చు. విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు. వినియోగదారుల క్రెడిట్ హిస్టరీని బట్టి పే లేటర్‌ను అందిస్తారు. అందులో వారి క్రెడిట్ హిస్టరీని బట్టి క్రెడిట్ లిమిట్‌ను ఇస్తారు. దాన్ని ఉపయోగించుకుని వస్తువులను కొనవచ్చు. బిల్లులను చెల్లించవచ్చు. కాకపోతే వాటికి అయ్యే మొత్తాన్ని మరుసటి నెలలో చెల్లించాల్సి ఉంటుంది.
అదే పేటీఎంలో అయితే పేటీఎం పోస్ట్ పెయిడ్ సదుపాయం అందుబాటులో ఉంది. దీంట్లో వినియోగదారులకు రూ.20వేల నుంచి రూ.1 లక్ష వరకు క్రెడిట్ లిమిట్ వస్తుంది. దీన్ని కూడా వినియోగదారులు తమకు నచ్చిన విధంగా ఉపయోగించుకోవచ్చు. ఒక నెలలో ఉపయోగించుకున్న మొత్తానికి చెందిన బిల్లును మరుసటి నెలలో చెల్లించాల్సి ఉంటుంది.
మొబిక్విక్‌లో అయితే జిప్ లేటర్ పేరిట ఈ సదుపాయం అందుబాటులో ఉంది. ఇందులోనూ క్రెడిట్ లిమిట్ కింద కొంత మొత్తాన్ని ఇస్తారు. అయితే ఇందులో 15 రోజులకు ఒకసారి వాడుకున్న మొత్తానికి చెల్లింపులు చేయాల్సి ఉంటుంది.