కేసీఆర్ కుటుంబం, తెలంగాణ పట్ల ఆంధ్రజ్యోతి పత్రిక మరోసారి విషం చిమ్మడం మొదలెట్టిందని జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత తీవ్ర విమర్శలు చేశారు. గురువారం ఉదయం తెలంగాణ భవన్ వేదికగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆంధ్రజ్యోతి పత్రిక కేసీఆర్ కుటుంబాన్ని మరోసారి టార్గెట్ చేసిందని ఫైర్ అయ్యారు.
రేవంత్ రెడ్డి మోడీని కలిసిన వెంటనే పాత్రికేయులతో చిట్‌చాట్ లో ఏదో నోటికొచ్చినట్టు మాట్లాడితే, ఆధారాలు లేకుండా వార్తలు ఎలా రాస్తారు? అంటూ ఆంధ్రజ్యోతి పత్రికపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాడిన వారు, ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ వ్యవహరంలో హస్తమున్న కొందరు నేతలు ఆకస్మికంగా చనిపోతున్నారని.. వారి మరణాలు మిస్టరీగా మారాయని సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఆంధ్రజ్యోతి పత్రిక బ్యానర్ కథనం ప్రచురించడంపై కవిత సీరియస్ అయ్యారు.వారి మరణాల వెనుక బీఆర్ఎస్ ఉందని అర్థంవచ్చేలా కథనాలు ప్రచురించే వారు ఆధారాలు చూపించాలని యాజమాన్యాన్ని ప్రశ్నించారు.