మంత్రి మండలి ఉపసంఘం నిర్ణయం
అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతి పరిధిలో మరో 6 సంస్థలకు భూములు కేటాయించాలని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన సచివాలయం 2వ బ్లాక్ మొదటి అంతస్తులోని ఆర్థిక మంత్రి ఛాంబర్‌లో గురువారం మధ్యాహ్నం జరిగిన మంత్రి మండలి ఉపసంఘం సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. భూములు కేటాయించిన తరువాత నిర్ణీత కాలంలోపల నిర్మాణాలు ప్రారంభించని సంస్థలకు నోటీసులు ఇవ్వాలని మంత్రుల బృందం అధికారులను ఆదేశించింది. సవిత విశ్వవిద్యాలయానికి 40 ఎకరాల చొప్పున రెండు విడతలుగా మొత్తం 80 ఎకరాలు, ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీకి 10.2 ఎకరాలు, జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు రెండు ఎకరాలు,
ఏపీపీఎస్సీకి 1.5 ఎకరాలు,ఏపీ క్రాఫ్ట్ కౌన్సిల్ కు ఒక ఎకరం, యంగ్ మెన్స్ క్రిస్టియన్ అసోసియేషన్(వైఎంసీఏ)కు 2.65 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించారు. సమావేశంలో మంత్రులు డాక్టర్ పి.నారాయణ, గంటా శ్రీనివాసరావు, నక్కా ఆనందబాబు, ఉన్నత విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్, వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.రవిచంద్ర, ఏపీ సీఆర్డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, ఏపీ సీఆర్డీఏ కమిషనర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తదితరులు పాల్గొన్నారు.