ఏపీలో స‌గానికి స‌గం త‌గ్గ‌నున్న బార్లు.. భారీగా ఆదాయం కోల్పోనున్న ప్ర‌భుత్వం..!

-

జనవరి 1 నుంచి ఏపీలో ఉన్న బార్లలో సగం వరకు మూత పడనున్నాయి. గతేడాది బార్ లైసెన్సు ఫీజు చెల్లింపులతో ఏపీకి రూ.2032 కోట్ల ఆదాయం రాగా ఇప్పుడది సగానికి పైగా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోకి వస్తే ఆ రాష్ట్రంలో దశలవారీగా మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పిన విషయం విదితమే. అందులో భాగంగా ఇప్పటికే ఆ రాష్ట్రంలో ఉన్న 4380 వైన్ షాపుల్లో 20 శాతం షాపులు.. అంటే.. 880 వైన్ షాపులను మూసేయించారు. ఇక త్వరలో మరిన్ని వైన్ షాపులను మూసివేయనున్నారు. అలాగే అక్కడి బార్ల సంఖ్యను కూడా తగ్గించనున్నారు.

జనవరి 1 నుంచి ఏపీలో ఉన్న బార్లలో సగం వరకు మూత పడనున్నాయి. ఇప్పటికే అక్కడ 840 బార్లు ఉండగా మరో నెలన్నర వ్యవధిలో 420 బార్లను మూసివేయనున్నారు. ఈ క్రమంలో మిగిలి ఉండే బార్ల లైసెన్సు ఫీజును 100 శాతం పెంచనున్నారు. కాగా గతేడాది బార్ లైసెన్సు ఫీజు చెల్లింపులతో ఏపీకి రూ.2032 కోట్ల ఆదాయం రాగా ఇప్పుడది సగానికి పైగా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ఇక అక్కడ ఉన్న మున్సిపాలిటీ కార్పొరేషన్లలో 495 బార్లు ఉండగా, మున్సిపాలిటీల్లో 297 బార్లు, నగర పంచాయతీల్లో 35 బార్లు, టూరిస్టు ప్లేసుల్లో 13 బార్లు ఉన్నాయి. వీటి ద్వారా ఆయా బార్ల యాజమాన్యాలకు గతేడాది రూ.2587 కోట్ల ఆదాయం వచ్చినట్లు అంచనా. ఈ క్రమంలో ఆ ఆదాయం ఇప్పుడు సగం వరకు తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.

అయితే ఏపీ ప్రభుత్వం జనవరి 1 నుంచి నూతన బార్ పాలసీని అమలు చేయనున్న నేపథ్యంలో అక్కడి బార్ల సంఖ్య తగ్గనున్న దృష్ట్యా మందుబాబులకు ఈ విషయం నిరాశను కలిగిస్తుందని మద్యం విక్రయదారులు చెబుతున్నారు. ఈ క్రమంలో కొత్త సంవత్సరం నుంచి మద్యం లభ్యత మరింత తక్కువ కానుండడంతోపాటు మద్యం ధరలు కూడా పెరగనుండడంతో ఇకపై అక్కడ మద్యం ప్రియులు మద్యపానం చేయాలంటే బెంబేలెత్తిపోవడం ఖాయమని తెలుస్తోంది. మరి ఈ విషయంపై ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి..!

Read more RELATED
Recommended to you

Exit mobile version