తిరుమలలో కొలువుదీరిన కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా భక్తులు తరలివస్తుంటారు. ముఖ్యంగా దేశ నలుమూలల నుంచి ప్రతిరోజు వేల మంది తిరుమలకు వస్తారు. కుటుంబంతో కలిసి పెద్ద ఎత్తున పోటెత్తుతున్న భక్తులతో తిరుమల ఆలయ ప్రాంగణం రద్దీగా మారుతోంది. ఇక శ్రావణమాసం కావడంతో ఈ రద్దీ మరింత ఎక్కువగా ఉంటోంది.
శ్రీవారి దర్శనానికి భక్తులు గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండాల్సి వస్తోంది. గురువారం రోజున టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పట్టిందని టీటీడీ అధికారులు తెలిపారు. శ్రీవారి సర్వ దర్శనానికి ఇంకా 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నట్లు వెల్లడించారు. తిరుమలలో నిన్న శ్రీవారిని 63,535 మంది భక్తులు దర్శించుకున్నట్లు చెప్పారు. 28,685 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించుకున్నారు. తిరుమలలో నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.81 కోట్లు సమకూరిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. శ్రావణమాసం కావడంతో పెద్ద ఎత్తులో భక్తులు స్వామి దర్శనానికి తరలివస్తున్నారని తెలిపారు.