దేశవ్యాప్తంగా టమాటా ధరల పెరుగుదలతో సామాన్యులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు రెండు నెలలుగా చాలా మంది వంటల్లో టమాటాలనే వాడటం లేదు. రోజురోజుకు పెరుగుతున్న టమాట ధరలు సామాన్యుల జేబు గుల్ల చేస్తుండగా.. మరోవైపు ధరల పెరుగుదల మాత్రం రైతులకు కలిసొస్తోంది. కాస్త ముందుచూపుతో టమాట పంటను వేసిన రైతులంతా ఇప్పుడు కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు.
తాజాగా ఏపీలోని చిత్తూరు జిల్లాకు చెందిన ఓ రైతు కుటుంబం కేవలం నెల రోజుల వ్యవధిలోనే రూ.3 కోట్ల ఆదాయం పొందింది. జిల్లాలోని సోమల మండలం కరకమంద గ్రామానికి చెందిన పి.చంద్రమౌళి, అతని తమ్ముడు మురళి, తల్లి రాజమ్మ ఉమ్మడిగా వ్యవసాయం చేస్తున్నారు. చాలా ఏళ్లుగా వీరు టమాటానే సాగు చేస్తున్నారు. ఈ ఏడు ఏప్రిల్‌లో సాహూ రకం టమాటా మొక్కలు 22 ఎకరాల్లో నాటారు. జూన్ చివరిలో దిగుబడి రాగా పంటను కర్ణాటకలోని కోలార్ మార్కెట్‌లో విక్రయించగా.. 15 కిలోల పెట్టె ధర రూ.వెయ్యి నుంచి రూ.1500 మధ్య పలికింది. ఇప్పటి వరకు 40వేల పెట్టెలు విక్రయించగా రూ.4 కోట్లు ఆదాయం వచ్చినట్లు రైతు తెలిపారు. అందులో ఖర్చులు పోగా.. రూ.3 కోట్ల ఆదాయం మిగిలిందని రైతులు చెప్పారు.