ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ లేఖ రాశారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు వినియోగం తీవ్ర ఆందోళనగా ఉందని… శ్రీవారి భక్త కోటిని, యావత్ ప్రపంచంలోని హిందువుల మనోభావాలను తీవ్రంగా కలిచి వేస్తోందని తెలిపారు. శ్రీవారి పవిత్రతను దెబ్బతీశారని, అన్యమత ప్రచారం జరుగుతోందని గతంలో ఫిర్యాదులు వచ్చినా గత పాలకులు పట్టించుకోలేదని ఆగ్రహించారు.
ఎర్రచందనం కొల్లగొడుతూ ఏడు కొండలవాడిని రెండు కొండలకే పరిమితం చేశారని చెప్పినా స్పందించలేదని.. ‘జంతువుల కొవ్వును లడ్డూ ప్రసాదంలో వినియోగించారని మీరు(చంద్రబాబు) చేసిన వ్యాఖ్యలతో లడ్డూ ప్రసాదంలో కల్తీ నిజమేనని యావత్ హిందూ సమాజం భావిస్తోందనిఆగ్రహించారు. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వును వినియోగించడం అత్యంత నీచమని మండిపడ్డారు.
హిందూ ధర్మంపై దాడికి భారీ కుట్ర జరిగినట్లుగానే భావిస్తున్నామని… లడ్డూ ప్రాముఖ్యతను తగ్గించడానికి, టీటీడీపై కోట్లాది మంది భక్తులకు ఉన్న విశ్వాసాన్ని సడలించేందుకు ఈ కుట్ర చేశారని ఆగ్రహించారు. దీనిపై సీబీఐతో విచారణ జరిపిస్తేనే సమగ్ర దర్యాప్తు జరిగి వాస్తవాలు నిగ్గు తేలే అవకాశముందన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబును కోరారు.