ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పద్ధతి బాగోలేకపోవడం వల్లే బిజెపిని వీడుతున్నట్లు కన్నా లక్ష్మీనారాయణ ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. సోము వీర్రాజు రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితులు మారిపోయాయని, పార్టీలో ఇమడలేని పరిస్థితులు ఉండడం వల్లే రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడే విషయంలో సోము వీర్రాజు వ్యవహార శైలి బాగోలేదని ఆయన పార్టీకి రాజీనామా చేసిన సందర్భంగా కామెంట్ చేశారు.
అయితే సోము వీర్రాజు పార్టీలో అవినీతికి పాల్పడ్డారంటూ కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలపై సోమ వీర్రాజు స్పందించారు. పార్టీ ప్రారంభించినప్పటి నుండి బిజెపి లోనే ఉన్నానని, తన గురించి పార్టీ పెద్దలకు తెలుసని అన్నారు సోము వీర్రాజు. కన్నా లక్ష్మీనారాయణ తనపై చాలాకాలం నుంచి ఆరోపణలు చేస్తున్నారని.. అప్పుడే స్పందించలేదని, ఇప్పుడు స్పందించాల్సిన అవసరం కూడా లేదన్నారు సోము వీర్రాజు.