“ముఖ్యమంత్రిని అయ్యాకే మళ్లీ సభకు వస్తాను, నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు. ఇది గౌరవ సభ కాదు. ఇదొక కౌరవ సభ. ఇలాంటి కౌరవ సభలో నేనుండనని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మీకో నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ అవమానం మీరందరూ అర్థం చేసుకుని నిండు మనస్సుతో ఆశీర్వదించమని కోరుతున్నా” ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరిగిన అవమానంపై అప్పట్లో చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలివి. చెప్పినట్టుగానే అప్పటి నుంచి సభకు దూరంగా ఉన్న ఆయన ముఖ్యమంత్రిగానే ఇవాళ అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు.
ముఖ్యమంత్రిగా మళ్లీ గౌరవసభలోనే అడుగుపెడతానని 2021 నవంబర్ 19న శపథం చేసిన చంద్రబాబు, రెండున్నరేళ్లకు పైగా సుదీర్ఘ విరామం తర్వాత ఇవాళ తొలిసారిగా అసెంబ్లీకి రానున్నారు. ఉదయం అమరావతి ప్రాంతంలోని వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలుగుదేశం మంత్రులు, ఎమ్మెల్యేలు నివాళులర్పించిన అనంతరం అసెంబ్లీకి వెళ్తారు.
ఇప్పటికే ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేసిన సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రొటెం స్పీకర్ హోదాలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరితో ప్రమాణం చేయించనున్నారు. తొలుత సభానాయకుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు చేత ప్రమాణం చేయిస్తారు. ఆ తరువాత వరుసగా ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రమాణం చేయనున్నారు.