రెండు తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో సామాన్యులు నానా అవస్థలు పడుతున్నారు.అయితే, ఈ వర్షాలకు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండమే కారణం. ఇది ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా కళింగపట్నం సమీపంలో అర్ధరాత్రి 12.30 నుంచి 2.30 గంటల ప్రాంతంలో తీరం దాటినట్లు తెలుస్తోంది. దీంతో ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, కాకినాడ, నంద్యాల,ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
తుఫాన్ తీరం దాటడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు, తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తుఫాన్ ఎఫెక్ట్ మరో రెండ్రోజుల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఆ నేపథ్యంలోనే ఏపీలో ఇప్పటికే స్కూళ్లకు సెలవులు ప్రకటించగా.. అవసరం ఉంటే తప్ప ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.ఇదిలాఉండగా, ఇప్పటివరకు ఏపీలో భారీ వర్షాల కారణంగా 10 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.