నేడు సుప్రీం కోర్టులో ఆర్ 5 జోన్ పై విచారణ జరిగింది. జస్టిస్ కె ఎం జోసఫ్, జస్టిస్ అరుణ్ కుమార్ ధర్మసనం ఈ పిటిషన్ ని విచారించింది. అయితే రాజధాని ఆర్ 5 జోన్ లో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడం పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రైతులకు చుక్కెదురైంది. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలను ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాకలైన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరగగా.. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఆర్ 5 జోన్ లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వొచ్చని, ఇళ్ల స్థలాలు ఇచ్చే హక్కు ప్రభుత్వానికి ఉందని తీర్పు వెలువరించింది. కానీ హైకోర్టు తుది తీర్పునకు లోబడే ప్రభుత్వ నిర్ణయం ఉండాలని సూచించింది. ఇక సుప్రీంకోర్టు తీర్పుతో ఆర్ 5 జోన్ లో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు ఏపీ ప్రభుత్వానికి అడ్డంకులు తొలగిపోయాయి.
ఈ నేపథ్యంలో ఈ నెల 26న అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఈనెల 26న 50 వేల మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలను అందించనున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాజధాని గ్రామాలలో పేదలకు కేటాయించిన భూములలో అధికారులు ఆగమేఘాలపై ప్లాట్ల విభజన పనులను చేపడుతున్నారు.