ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని అన్నారు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు. మూడు రాజధానులకు మద్దతుగా కొందరి చేత రాజనామాలు చేయించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత మూకుమ్మడి రాజీనామాలు చేసి.. అసెంబ్లీ రద్దు వంటివి జరుగుతాయని జోష్యం చెప్పారు. వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు.
వైసీపీ ప్రభుత్వం ఈ మూడున్నర ఏళ్లలో మూడు ముక్కలాట తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. అయితే ఇప్పటికే మూడు రాజధానులకు మద్దతుగా రాజీనామా చేసేందుకు సిద్ధమని మంత్రి ధర్మాన ప్రసాదరావు, విప్ కరణం ధర్మశ్రీ ప్రకటించారు. మరోవైపు అమరావతిని రాజధానిగా కొనసాగించాలని అమరావతి నుంచి అరసవిల్లి మహాపాదయాత్ర నిర్వహిస్తున్నారు. వారికి పోటీగా జేఏసీ ఆధ్వర్యంలో మూడు రాజధానుల ఉద్యమం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రఘురామకృష్ణరాజు ఈ వ్యాఖ్యలు చేశారు.