తాడేపల్లి: అమర్నాధ్ హత్య రెండు కుటుంబాలకు చెందిన సమస్య అన్నారు వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ. ఇందులో కులాలు, పార్టీల ప్రమేయం లేదన్నారు. అమర్నాధ్ సోదరి పల్లవికి ఉద్యోగ కావాలని అడిగారని తెలిపారు. అమర్నాధ్ హత్య కేసులో నిందితులను 24 గంటలలో అరెస్ట్ చేశామన్నారు. ప్రభుత్వ పరంగా అమర్నాధ్ కుటుంబ సభ్యులకు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేశామన్నారు.
జరిగిన సంఘటనకు చంద్రబాబు కుల రంగు, పార్టీ రంగు పులిమి కుల రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబం బాధలో ఉన్నపుడు బలహీనత అడ్డుపెట్టుకొని శవ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. స్థానిక సభ్యుడి శవంతో రోడ్ పై ధర్నా చేయటాన్ని ఏమనాలి? అని ప్రశ్నించారు. చంద్రబాబుకి మా కుటుంబ సభ్యుల పేరు ఎత్తే అర్హత లేదన్నారు. ఇంకోసారి సందర్భం లేకుండా కుటుంబ సభ్యుల ప్రస్తావన తెస్తే నాలుక చిరేస్తామని హెచ్చరించారు.
పవన్ కళ్యాణ్ లా ప్యాకేజ్ డబ్బులు తెచ్చుకునే వాళ్ళం కాదన్నారు. మత్స్యకారుల సమస్యలు పవన్ కళ్యాణ్ కి ఏమి తెలుసని ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ రాష్ట్రంలో నేరాలు, ఘోరాలు జరుగుతున్నాయని చేస్తున్న ప్రచారాలు ప్రజలు నమ్మరని అన్నారు. విశాఖ ఎంపీ కుటుంభ సభ్యుల కిడ్నాప్ కి రకరకాల కారణాలు ఉన్నాయన్నారు. వాటి అన్నిటి పైనా విచారణ జరుగుతుందన్నారు.