టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి పొంగూరు నారాయణ అరెస్ట్ పై వైసిపి ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. పదవతరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం లో హైదరాబాదులో నారాయణ అరెస్టు చేసిన ఏపీ పోలీసులు ఆయనను రోడ్డు మార్గం మీదుగా చిత్తూరు తరలిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈ అరెస్టుపై సజ్జల స్పందించారు. అధికారులకు స్వేచ్ఛ ఇవ్వడం వల్లనే నారాయణ దొరికిపోయారన్న సజ్జల.. రికార్డుల పేరుతో నారాయణ తప్పుడు విధానాలకు పాల్పడ్డారని వ్యాఖ్యానించారు.
పోటీ తత్వంతో పిల్లలని తీర్చిదిద్దాల్సింది పోయి తప్పుడు మార్గాలను ఎంచుకున్నారని అన్నారు. మాస్ కాపీయింగ్ లో స్పెషలిస్ట్ గా తయారయ్యారని అన్నారు. తీగలాగితే అసలు దోషులు బయటకు వస్తున్నారని అన్నారు. నారాయణ చదువు పేరుతో వేల కోట్లు సంపాదించి రాజకీయాల్లోకి వచ్చారన్నారు సజ్జల.కొంతమంది చీడపురుగుల్లా తయారయ్యి జగన్ ప్రభుత్వం పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు.ఈ కల్చర్ నారాయణ, చైతన్య విద్యా సంస్థల్లోనే మొదలైందని అన్నారు.