దసరా మహోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలోని దేవరగట్టులో ప్రతి ఏటా నిర్వహించే బన్నీ (కర్రల సమరం) ఉత్సవంలో ఈ ఏడాది హింస తప్పలేదు. ఈ కర్రల సమరంలో జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. కర్రల సమరాన్ని చూసేందుకు కొందరు స్థానికులు సమీపంలోని చెట్టు ఎక్కగా.. ప్రమాదవశాత్తూ చెట్టు కొమ్మ విరిగిపడి గణేశ్ అనే యువకుడు అక్కడికక్కడే మరణించాడు. ఈ సమరంలో 100 మందికిపైగా గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను అధికారులు ఆలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
దేవరగట్టుపై వెలసిన మాళ మల్లేశ్వరస్వామి తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రల్లోనూ ఫేమస్. ఈ ప్రాంతాల నుంచి ప్రతి ఏటా బన్నీ ఉత్సవాన్ని చూసేందుకు భక్తులు తరలివస్తారు. ఏటా విజయదశమి రోజు అర్ధరాత్రి కొండపై వెలసిన మాళ మల్లేశ్వరస్వామికి మల్లమ్మతో కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించి.. ఉత్సవ విగ్రహాలతో ఊరేగింపుగా జైత్రయాత్రకు బయల్దేరారు. గట్టుపై నుంచి కిందకు వచ్చి సింహాసన కట్ట వద్ద ప్రత్యేక పూజలు జరిపి అనంతరం కర్రల సమరం నిర్వహించారు.