NDA సమావేశంలో ఏపీ రాజకీయాలపై చర్చ జరుగలేదు – పవన్‌ కళ్యాణ్‌

-

NDA సమావేశంలో ఏపీ రాజకీయాలపై చర్చ జరుగలేదన్నారు జనసేన చీఫ్‌ పవన్‌ కళ్యాణ్‌. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఎన్డీఏ సమావేశంలో చర్చ జరగలేదని, దేశ రాజకీయ పరిస్థితుల గురించే ప్రధానంగా చర్చ జరిగింది అని పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. ఎన్డీఏ పక్షాల సమావేశం కోసం ఢిల్లీ వెళ్ళిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు సమావేశం అనంతరం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “శ్రీ నాని ఫాల్కివాలా చెప్పినట్లు దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు గుండె ధైర్యంతో నిలబడడమే గొప్ప విషయం.

పార్లమెంట్ మీద తీవ్రవాదుల దాడి తర్వాత నాకు కూడా అదే అనిపించింది. దేశానికి బలమైన నాయకత్వం అవసరం అనిపించింది. 2014లో శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంతో దేశం మరింత పటిష్టమైంది. దేశానికి పటిష్ట నాయకత్వం వల్ల వచ్చే జరిగే మేలు ఏమిటి అన్నది భారతదేశం అంతా గమనిస్తోంది. ఎన్డీఏ పక్షాల సమావేశంలో భవిష్యత్తులో ఎన్డీఏ కూటమి ఏ విధంగా భారతదేశాన్ని ముందుకు తీసుకువెళ్లాలి..? దేశ ప్రజలకు అత్యున్నత జీవన విధానం అందించేందుకు, అభివృద్ధి సాధించేందుకు ఎలాంటి విధానాలు తీసుకురావాలి అన్నదానిపై చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఎలాంటి చర్చ జరగలేదు. వచ్చే ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహం, పొత్తులు, సీట్ల సర్దుబాటు మీద మాట్లాడలేదు. మొత్తం భారతదేశ రాజకీయాలు, భవిష్యత్తు వ్యూహాలపైనే ప్రధానంగా చర్చ జరిగింది” అన్నారు. ఈ సందర్భంగా విలేకరులు ఎన్డీఏ కూటమిలో ఇప్పటికే 38 పార్టీలు ఉన్నాయని, ఆంధ్రప్రదేశ్ నుంచి కొత్త పార్టీ ఎన్డీఏ కూటమిలో చేరే అవకాశాలు ఉన్నాయా? అని పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించగా రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు అని సమాధానం ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version