రెండవ పెళ్లి చేసుకోవడమే నేరమని పేర్కొంటున్న జగన్ మోహన్ రెడ్డి తన ముత్తాత చట్ట విరుద్ధంగా చేసుకున్న రెండవ పెళ్లి ద్వారా జన్మించిన సంతానమే ఆయన అని గుర్తించాలని ప్రజలు కోరుతున్నారని రఘురామకృష్ణ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎక్కడ నుంచి బలపనూరుకు వచ్చారో తెలియని వెంకట్ రెడ్డి తొలుత లక్ష్మమ్మ అనే మహిళను వివాహం చేసుకున్నారని, ఆ తర్వాత మంగమ్మ అనే మహిళను కూడా మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే పెళ్లి చేసుకున్నారని పేర్కొన్నారు. లక్ష్మమ్మకు ఒక కుమారుడు చిన్న కొండారెడ్డి జన్మించగా, మంగమ్మకు ఆరుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు జన్మించారని తెలిపారు. కొండారెడ్డికి ఏడుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు జన్మించారని, అందులో ఒకరే భాస్కర్ రెడ్డి గారని, ఆయన కుమారుడే అవినాష్ రెడ్డి గారు కాగా, కుమార్తె కుమార్తెనే వై.యస్. భారతి రెడ్డి గారని అన్నారు.
చేనేత నేస్తం కార్యక్రమంలో నేతన్నల కష్టాలు కాకుండా జగన్ మోహన్ రెడ్డి గారు తన కష్టాలను చెప్పుకున్నారని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి నోటికొచ్చినట్లు మాట్లాడుతూ అర్థం పర్ధం లేని ఆరోపణలు చేశారని, పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుని వివాహం చేసుకున్న పవన్ కళ్యాణ్ గారి గురించి అసభ్యంగా మాట్లాడిన జగన్ మోహన్ రెడ్డి గారిపై ఆయన వెంటనే పరువు నష్టం దావా వేయాలని, అప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడు అవుతారని అన్నారు. వెంకట్ రెడ్డి గారు చేసుకున్న రెండో భార్య మంగమ్మ మనవడే వై.యస్. రాజశేఖర్ రెడ్డి గారు కాగా, ముని మనవడు జగన్ మోహన్ రెడ్డి గారని తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి గారు చెబుతున్నట్లుగా ముత్తాత వెంకట్ రెడ్డి కూడా అనుసరించి ఉంటే ఈ రాష్ట్రానికి దరిద్రం దాపురించి ఉండేది కాదని పలువురు అంటున్నారని, ఒక్కరిని వేలెత్తి చూపిస్తే, నాలుగు వేళ్లు మన వైపే చూపిస్తాయని ఇప్పటికైనా జగన్ మోహన్ రెడ్డి గారు గుర్తించాలని ప్రజలు సూచిస్తున్నారని రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు.