రఘురామ కృష్ణం రాజు నేడూ వైకాపా రెబల్ ఎంపీగా మారారు… తనకు షోకాజ్ నోటీస్ ఇచ్చిన పార్టీకే తిరిగి షోకాజ్ ఇచ్చారు… అక్కడితో ఆగకుండా నేరుగా లోక్ సభ స్పీకర్, కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు… నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని వైకాపా ఎమ్మెల్యేలను పందులతో పోల్చారు… సాయిరెడ్డిపై సెటైర్లు వేశారు… జగన్ విషయంలో నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించారు… ఇవన్నీ చేసింది తాను కాదంటున్నారు రఘురామకృష్ణంరాజు! ఇదంతా మీడియా పనంట!!
ఉరిమి ఉరిమి మంగళం మీద పడింది అన్నట్లుగా… ఇంతకాలం మైకుదొరకడమే ఆలస్యం, డిబేట్ కు పిలవడమే లేటూ అన్నట్లుగా అన్ని రకాల ఛానల్స్ లోనూ తనదైన వాక్ చాతుర్యం చూపించిన ఆయన.. ఇదంతా మీడియా చేసినపనిగా అభివర్ణిస్తున్నారు. మీడియానే మా సంసారంలో నిప్పులు వేయాలని చూస్తోందని.. అలాంటి పనులు మానుకోవాలని కూడా సూచించారు. మీడియా పిలిచిందా ఆర్.ఆర్.ఆర్. ని ఫస్ట్ ఇంటర్యూకి రండి.. పార్టీ – ప్రభుత్వ విధానలపై ప్రశ్నించండి.. తమరు అధికారపార్టీ ఎంపీ అన్న విషయం మరిచిపోయి మరీ చెలరేగిపొండి అని మీడియా సలహా ఇచ్చిందా?
తనకుతాను అత్యంత తెలివైన వ్యక్తిగా భావించుకుంటారు అన్న పేరు సంపాదించుకున్న ఆర్.ఆర్.ఆర్… మీడియా చెప్పినట్లు ఆడేటంత అమాయకులా? జర్నలిస్టులు సవాలక్ష ప్రశ్నలు అడుగుతారు.. అది వారి వృత్తి ధర్మం, బాధ్యత కూడా… వారు అడిగిన అన్ని ప్రశ్నలకూ సమాధానాలు చెప్పింది ఆయనే కానీ… మీడియ సొంతంగా రాసుకోలేదు.. విశ్లేషణ చేయలేదుగా! ఈ విషయాలు మరిచిన రఘురామకృష్ణం రాజు… మీడియాపై పడుతున్నారు.
ఈలెక్కన చూసుకుంటే.. పార్టీకి తాను ఎప్పుడూ వ్యతిరేకంగా మాట్లాడలేదు, ప్రభుత్వం వేరు – పార్టీ వేరు అని మీడియా గ్రహించాలని సన్నాయినొక్కులు నొక్కుతున్నారు! ఏపీలో ఇప్పుడున్న ప్రభుత్వమేమీ.. రెండు మూడు పార్టీలతో ఏర్పడిన కూటమి ప్రభుత్వం కాదు కదా! ఆ విషయం అతితెలివైన ఆర్.ఆర్.ఆర్. కు మీడియా చెప్పాలా? ఎంత మాట ఎంతమాట…!!