టీడీపీకి అంతో ఇంతో బలం ఉన్న జిల్లా కృష్ణా. అయితే, ఈ జిల్లాపై చంద్రబాబు శీతకన్నేస్తున్నారని. తమను పట్టించుకోవడం లేదని నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ తరఫున గట్టి వాయిస్ వినిపించేవారిలో చాలా మంది నేతలు ఇక్కడ ఉన్నారు. పార్టీ అధినేత ఆదేశించినా.. ఆదేశించకపోయినా.. తమంతట తాముగా నిర్ణయాలు తీసుకుని పార్టీని నడిపించే నేతలు చాలా మంది ఉన్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమా, బొండా ఉమా, ఎంపీ కేశినేని నాని, వేదవ్యాస్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వంటివారు చాలా వరకు యాక్టివ్‌గా ఉన్నారు.
ఎవరికి వారు గ్రూపు రాజకీయాలు చేసుకుంటున్నా.. అంతిమంగా పార్టీ కోసం, పార్టీఎదుగుదల కోసం ప్రయత్నాలు చేస్తున్నారనడంలో సందేహం లేదు. అదేసమయంలో పార్టీ అదినేత పిలుపు అందిపుచ్చుకుని వారు ఉద్యమాల్లోనూ పార్టిసిపేట్ చేస్తున్నారు. మరి ఇంత చేస్తున్న వీరికి పార్టీ తరఫున ప్రోత్సాహం కరువవుతోందనే వాదన ఇటీవల తీసుకున్న నిర్ణయాలతో స్పష్టంగా తెలుస్తోందని అంటున్నారు. జిల్లాకు చెందిన మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణకు పార్టీలో ఇంచార్జ్ పోస్టు ఇచ్చారు. ఆయనను మచిలీపట్నం పార్లమెంటరీ పార్టీ ఇంచార్జ్‌గా నియమించారు. కానీ, ఆయనకు వాయిస్ లేదని.. ఇప్పటి వరకు ఫైర్‌బ్రాండ్‌గా ఆయన చేసిన ప్రసంగం ఒక్కటి కూడా లేదని తమ్ముళ్లే సెలవిస్తున్నారు.
అదే సమయంలో పార్టీకి కీలకంగా ఉన్న బొండా ఉమాను పొలిట్‌బ్యూరోలో నియమించారు. పొలిట్‌బ్యూరో ఉన్నవారు సాధారణ కార్యకలాపాలకు దూరంగా ఉండాలనే షరతు పెట్టారు. దీంతో ఆయన కూడా సైలెంట్ అయ్యారు. మిగిలిన వారికి ప్రాధాన్యమే ఇవ్వలేదు. మరీ ముఖ్యంగా మాజీ మంత్రి, నిత్యం మీడియాలో ఉండే దేవినేని ఉమాకు ఎలాంటి పదవినీ అప్పగించలేదు. అదేవిధంగా మేధావిగాపేరున్న మండలి బుద్ధప్రసాద్కు కూడా ప్రాధాన్యం లేకుండా పోయింది. కేశినేనిని అసలు పట్టించుకోలేదు. ఇక, విజయవాడ నగర ఇంచార్జ్.. ఫైర్ బ్రాండ్ బుద్ధా వెంకన్నకు కూడా ఛాన్స్ ఇవ్వలేదు.
ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌కు మంచి పేరుంది.. ఆయనను కూడా బాబు దూరం పెట్టారు. దీంతో వీరంతా కూడా మేం ఎందుకు మాట్లాడాలి? అనే ప్రశ్న తెరమీదకి తెస్తున్నారు. మొత్తంగా ఈపరిణామాలతో కృష్ణాలో టీడీపీ దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉందని అంటున్నారు పరిశీలకులు. మరి చంద్రబాబు మాత్రం వీరిని బుజ్జగించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని, ఇంకా ఏవో పదవులు ఉన్నాయని, ఇస్తామని అంటున్నట్టు తెలుస్తోంది. మరి ఏం చేస్తారో చూడాలి.